గడ్డం పెంచి, కాస్త స్లిమ్ అయిపోతే.. రాజకీయ నాయకుడిగా ‘మాస్.. ఊర మాస్ ఇమేజ్’ వచ్చేసినట్లేనన్న భ్రమల్లో నారా లోకేష్ వున్నారో, అలాంటి భ్రమల్లోకి టీడీపీ శ్రేణుల్ని నెట్టేస్తున్నారోగానీ.. గత కొద్ది రోజులుగా నారా లోకేష్ చూపిస్తున్న హైపర్ ఎనర్జీ మాత్రం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా నారా లోకేష్ తీరు చూశాం. ‘జగన్ రెడ్డీ.. బస్తీ మే సవాల్..’ అంటూ చెలరేగిపోయారు. ‘మీ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో మీకుగానీ, మీ కుటుంబానికిగానీ సంబంధం లేదంటూ ప్రమాణం చేస్తావా.?’ అంటూ నారా లోకేష్ సవాల్ విసిరేసిన వైనం అప్పట్లో ఓ హాట్ టాపిక్.
టీడీపీ అనుకూల మీడియా లోకేష్ విసిరిన సవాల్‌పై అత్యుత్సాహంతో కథనాలు వండి వడ్డించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసలు సిసలు ప్రత్యర్థి నారా లోకేష్.. అంటూ ఎలివేషన్లు ఇచ్చింది టీడీపీ అనుకూల మీడియా. కానీ, ఏం జరిగింది తిరుపతి ఉప ఎన్నికలో.? వైసీపీ గెలుపుని నారా లోకేష్ ఓవరాక్షన్ అడ్డుకోలేకపోయింది.. చంద్రబాబు డ్రామాలేవీ వర్కవుట్ కాలేదు.
నిజానికి, అసహనం.. అన్న పదానికి బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబునాయుడు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకి ప్రజల్ని గౌరవించడం తెలియకపోవడం శోచనీయం. అదే.. ఆ అహంకారమే తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఈ స్థాయికి దిగజార్చేసింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆయా నగరాలు, పట్టణాల్లో పర్యటించినప్పుడు ఓటర్లను ఉద్దేశించి ‘మీకు సిగ్గులేదా.?’ అంటూ రెచ్చిపోయారు చంద్రబాబు.
అలాంటి దిగజారుడు వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ అధినేత ‘ఫలితం’ అనుభవిస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘ఏం పీకావ్..’ అంటూ ఓ సందర్భంలో చంద్రబాబు నోరు జారారు.. స్థాయిని మరిచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ చందబ్రాబు వారసుడే కదా.. నారా లోకేష్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టున్నారు. లేదంటే, రాజకీయం ఇలాగే చేయాలని బహుశా చంద్రబాబు, తన పుత్ర రత్నానికి నూరిపోస్తుండొచ్చు పచ్చ, పిచ్చ రాజకీయాన్ని.
లేకపోతే, ’సీబీఐ విచారణ వెయ్ రా…’ అంటూ నారా లోకేష్ నోరు జారడమేంటి.? నోరు జారడం కాదు, అసహనంతో నారా లోకేష్ ఊగిపోతున్నారు. హద్దూ అదుపూ లేకుండా చెలరేగిపోతున్నారు నారా లోకేష్. గత కొద్ది రోజులుగా టీడీపీ నేతల మీద వేధింపులు, కుట్ర పూరిత కేసులు.. అంటూ నారా లోకేష్, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.. టీడీపీ నేతలకు సానుభూతి ప్రకటించే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు.
ఇదా రాజకీయం.? రాజకీయాల్లో విమర్శలు మామూలే కావొచ్చు. ఆ విమర్శల తీవ్రత ఒక్కోసారి ఎక్కువగానే వుండొచ్చు. కానీ, ఇంత జుగుప్సాకరంగానా.? ప్రజలు ఛీత్కరించుకుంటున్నా, టీడీపీ నేతలు తమ భాష మార్చుకోకపోవడాన్ని ఏమనుకోవాలి.? ఇంకేమనుకోవాలి.. ముఖ్యమంత్రిని తిడితే, తమ స్థాయి పెరుగుతుందని బహుశా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్ అనుకుంటున్నట్టున్నారు.
కక్ష సాధింపు చర్యలకే దిగితే.. కుట్రపూరితమైన రాజకీయాలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెయ్యాలనుకుంటే, ఎమ్మెల్యేలుగా టీడీపీలో చందబ్రాబు వెంట ఆయన బావమరిది బాలకృష్ణ కూడా మిగలకపోవచ్చు. ఎమ్మెల్సీల విషయానికొస్తే, లోకేష్ ఒక్కరే మిగలొచ్చు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఆపరేషన్ ఆకర్షని మధ్యలో వదిలేసి, కొంతమేర టీడీపీకి మేలు చేశారన్నది నిర్వివాదాంశం.
సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుని మరీ ఒంటరిగా చూడాలంటే కాస్త కష్టంగానే వుంటుంది ఎవరికైనా. అలా వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని అనుకోవాలేమో. వైఎస్ జగన్ తమకు ఇంత మేలు చేస్తున్నందుకు చంద్రబాబు, లోకేష్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రుణపడి వుండాలన్నది కొందరు రాజకీయ విశ్లేషకులు చేస్తోన్న సరదా కామెంట్. అది ఉత్త సరదా కామెంట్ మాత్రమే కాదు, వాస్తవం కూడా.
దేశంలో పెట్రో ధరలు పెరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పెట్రోధరలు సెంచరీ దాటేశాయి. కానీ, తెలుగుదేశం పార్టీ ఇటు ఆంధప్రదేశ్‌లోగానీ, అటు తెలంగాణలోగానీ ఉద్యమాలు చేపట్టలేకపోతోంది కేంద్రానికి వ్యతిరేకంగా. రాష్ట్రంలో పెట్రోల్ ధర పెరిగిపోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారణమంటూ ఏపీ టీడీపీ యాగీ చేయడంలోనే టీడీపీ డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీనీ, కేంద్రాన్నీ విమర్శించలేక.. ఆ అసహనాన్నంతా తండ్రీ కొడుకులు, ఏపీ ప్రభుత్వం మీద.. అందునా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద చూపిస్తున్నారని అనుకోవాలన్నమాట.