ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు ఎస్పీ బాలు పేరు చేరుస్తూ జగన్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్పీ బాలుది స్వస్థలం నెల్లూరే కావడం విశేషం. ఆయన పాటకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లానే మొదటి శ్రోత. ఆ జిల్లాలో మొట్ట మొదట చిన్నచిన్న కచేరీల్లో పాడడం మొదలై ఇంతింతై అన్నట్టు ….ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి ఎస్పీ బాలు తన గానమాధుర్యంతో చేరుకున్నారు.
కరోనా బారిన పడ్డ ఎస్పీ బాలు తీవ్ర అనారోగ్యం పాలై చివరికి అనంతలోకాలకు చేరుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం ఏపీ ప్రభుత్వం నెల్లూరులోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని అదే జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విటర్ వేదికగా తెలిపారు.
తన తండ్రి పట్ల గౌరవంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎస్పీ బాలు తనయుడు చరణ్ హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవమని, సీఎం జగన్, ఏపీ ప్రభుత్వానికి ఆయన ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు.