అధికారుల ఆకస్మిక తనిఖీలు, ఫిర్యాదుల స్వీకరణ, పల్లెనిద్రలు.. ఇలాంటివి గత ప్రభుత్వాల హయాంలో కూడా జరిగాయి. వాటి ఫలితం ఎలా ఉంటుందో ప్రజలకి బాగా తెలుసు. ఈసారి జగన్ హయాంలో స్పందన అనే పేరుతో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార కార్యక్రమాలు నేటినుంచి మొదలవుతున్నాయి.
ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ప్రజలంతా అర్జీ ఇచ్చేసి తమ పని అయిపోయిందని అనుకుంటారు. అధికారులు కూడా అదే రకంగా భరోసా ఇస్తారు. అయితే అక్కడితో ఆగకుండా ఆ పనుల్ని సరైన సమయంలో పరిష్కరించగలిగితేనే ప్రజలకు ఉపయోగం, ప్రభుత్వానికి మంచిపేరు.
ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ ల మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి ఇదే విషయంపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని చేపట్టి చెప్పిన సమయం కంటే ముందే ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ పని జరక్కపోతే కారణాలు ప్రజలకు కచ్చితంగా, అర్థమయ్యేలా తెలియజెయ్యాలని కండిషన్ పెట్టారు.
గత ప్రభుత్వ హయాంలో అర్జీలు తీసుకున్నామా, పక్కనపెట్టామా అనేరకంగా గ్రీవెన్స్ డేలు జరిగేవి. ఒకేసారి అధికారుల్ని గుంపులు గుంపులుగా గ్రామాల మీదకు పంపించి మరీ స్పెషల్ గ్రీవెన్స్ లు చేపట్టిన సందర్భాలున్నాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ పేరుతో ఇలా అర్జీలు తీసుకోవడం, అలా అంకెల గారడీ చేయడం చంద్రబాబుకి అలవాటు.
ఆర్టీజీఎస్ పేరుతో సమస్యలకు మసిపూసి మారేడు కాయ చేసి, నిజంగానే సమస్యలు పరిష్కారం అయ్యాయనే దిశగా ప్రజల్ని మభ్యపెట్టారు బాబు. అధికారులకి కూడా అది అలవాటైంది. లెక్కలు చూపించి తప్పించుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాకూడదు. జగన్ విజన్ కచ్చితంగా పట్టాలెక్కితేనే ప్రజలకు మేలు జరుగుతుంది.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాల నుంచి అధికారులు గుణపాఠం నేర్చుకుంటేనే ఫలితం ఉంటుంది. లేకపోతే ఎన్ని స్పందనలు వచ్చినా ఫలితం శూన్యం. ఈ దిశగా జగన్ ఇప్పటికే ఉన్నతస్థాయి అధికారులకు హితబోధ చేసినా.. అది కింది స్థాయిలో అమలైతేనే ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది.
స్పందన కార్యక్రమాన్ని అడుగడుగునా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తే.. పగడ్బందీగా అమలుచేస్తే, అభివృద్ధి కార్యక్రమాల అమలు కంటే అది పదింతలు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెడుతుంది.