దేశంలో నానుతున్న ఒక ప్రముఖ ఆర్థిక కేసుల్లో సహారా కేసు ఒకటి. ఇన్వెస్టర్ల నుంచి 25,700 కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించారని సహారా గ్రూప్ కంపెనీలు రెండింటిపై కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ప్రముఖ వ్యాపార వేత్తల్లో సహారా చీఫ్ సుబ్రతోరాయ్ ఒకరు. ఈ విషయమై ఆయనపై సెబీ కేసులు నమోదు అయ్యాయి. కొంతకాలం పాటు ఆయన జైల్లో ఉన్నట్టున్నారు. చివరకు విడుదల అయ్యారు.
ఇప్పుడు ఆ కేసుల్లో విచారణ కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా సుబ్రతోరాయ్ కు వ్యక్తిగత హాజరీ నుంచి సుప్రీం కోర్టు మినహాయింపును ఇచ్చింది. ఆయనకే గాక.. ఆయన కంపెనీల్లో ఇద్దరు డైరెక్టర్లకు సైతం కోర్టు మినహాయింపు దక్కింది. వారు వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదని.. వారి లాయర్లు చాలన్నట్టుగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
కట్ చేస్తే..ఇదే రోజే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయనపై నమోదు అయిన కేసుల్లో వ్యక్తిగత హాజరీ నుంచి కోర్టు మినహాయింపును ఇవ్వలేదనే వార్తా పేపర్లలో కనిపిస్తూ ఉంది. దాదాపు 9 సంవత్సరాలుగా జగన్ ఈ కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. క్విడ్ ప్రో కో అంటూ ఆయనపై సీబీఐ కేసులు పెట్టింది. అవి ఇప్పటి వరకూ నిరూపణ కాలేదు. ఈ కేసులపై పలువురు నిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇవి నిలవవు అంటూ వ్యాఖ్యానించారు. జగన్ పై సీబీఐ ఇప్పుడు మోపిన అక్రమాల విలువ కూడా చాలా తక్కువ.
అయినా జగన్ మాత్రం ప్రతి శుక్రవారం కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. ఆయన సీఎం హోదాలో ఉన్నా.. ప్రతి వారం విచారణకు హాజరు అవుతూ, వాయిదా పడగానే వెళ్తూ ఉన్నారు. పాతిక వేల కోట్ల రూపాయల పెద్ద స్కామ్ సహారాది! అదొక ప్రైవేట్ సంస్థ. ప్రజల సొమ్మును అక్రమంగా సేకరించారు అనే అభియోగాలు నమోదు అయ్యాయి. దాని అధినేత ఎలాంటి రాజ్యాంగపదవుల్లోనూ లేడు.
వ్యాపారం చేయడమే అతడి పని. 25 వేల కోట్ల రూపాయల వ్యవహారంపై విచారణలో ఆయన వ్యక్తిగత హాజరీ నుంచి కోర్టు మినహాయించిన రోజునే.. ముఖ్యమంత్రి హోదాలో..కేవలం కొన్ని కోట్ల రూపాయల వ్యవహారాల్లో అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తికి మాత్రం కోర్టు హాజరీ నుంచి మినహాయింపు లభించలేదు. సామాన్యుడికి అంతుబట్టని న్యాయ వ్యవస్థ లాజిక్కులు ఇవి!