‘అమరావతి రాజధానిని అంగుళం కూడా కదలనివ్వం. కేంద్రం చూస్తూ ఊరుకోదు. తగిన సమయంలో సరైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుంది. తాడిని తన్నేవాడు ఇక్కడుంటే, తల తన్నే మోడీ ఢిల్లీలో ఉన్నాడు’ అని జగన్ సర్కార్‌తో పాటు రాష్ట్ర ప్రజలను బెదిరించిన వారెవరు అంటే…సుజనాచౌదరి అని వెంటనే చెప్పేస్తారు.
అలాంటి నేత ఉన్నట్టుండి సీఎం జగన్‌కు ఓ ప్రేమ లేఖ రాశాడు. రాజధాని మార్పు ఆలోచనపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అసెంబ్లీలో రాజధాని ఎంపికపై ఏకగ్రీవంగా ఆమోదించిన పాత విషయాలను జగన్‌కు గుర్తు చేశాడు. అమరావతిలో రూ.42 వేల కోట్ల పనుల నిలిపివేతను సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. సుజనా లేఖలోని ముఖ్యాంశాలు ఏంటంటే…
*విశాఖపట్నంలో పాలనా రాజధాని ఏర్పాటు కోసం భవనాలు వెతుకుతున్నట్టు మంత్రుల ప్రకటనలు, రాజధానిలో ఆందోళనలు బాధ కల్గిస్తున్నాయి.
*రాజధాని తరలింపు ఆర్థికంగా, న్యాయపరంగా దుష్ఫ్రరిణామాలను చూపిస్తుంది.
*రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా తరలింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి.
* భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలి.
*చెట్టును రక్షిస్తే అది మనకు నీడనిస్తుంది.. అమరావతిని రక్షిస్తే అది రాష్ట్రానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.
*ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రాజధాని అమరావతిలోనే కొనసాగించాలి.
విశాఖలో సచివాలయం ఏర్పాటు కోసం భవనాలు వెతుకుతున్నట్టు మంత్రల ప్రకటన సుజనాకు ఆందోళన, బాధ కలిగిస్తున్నాయట. అంతే కాదు రాజధాని తరలింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని విన్నవిస్తున్నాడు. అమరావతి అనే చెట్టును రక్షిస్తే రాష్ట్రానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుందని జగన్‌కు జ్ఞానోదయం కలిగించాలని సుజనా తాపత్రయపడ్డాడు.
నిన్నమొన్నటి వరకు అంగుళం కూడా రాజధానిని కదలనివ్వమని, చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించిన సుజనాచౌదరిలో ఎందుకీ మార్పు? తల తన్నేవాడు ఢిల్లీలో ఉన్నాడని బెదిరించిన సుజనా…ఇప్పుడు పునఃసమీక్షించుకోవాలని జగన్‌ను విన్నవించడం ఏంటి? రాష్ట్రం మొత్తానికి ఒక్క అమరావతి చెట్టే ఎందుకుండాలి? ఆ చెట్టు కిందే ఆర్థిక రక్షణ ఎందుకు? ప‌్రతి ఒక్కరూ తమతమ ప్రాంతాల్లో చెట్లు పెంచుకుని ఆర్థిక సంరక్షణ పొందేలా ఆత్మాభిమానాన్ని పెంపొందించాలి కదా? ఈ పని జగన్ సర్కార్ చేస్తే తప్పేంటి.