ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియని వంగవీటి రాధా చాలా కాలం తర్వాత ఇంటి నుంచి బయటికొచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. సీఎం జగన్, రాజధాని, రాష్ట్రం అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నాడు. సీఎం జగన్ వెన్నుపోటు పొడిచాడని విమర్శించే ముందు కనీసం ఒక్కసారైనా రాధా వెనక్కి గతాన్ని గుర్తు చేసుకుని ఉంటే ఇలా మాట్లాడేవాడు కాదని వంగవీటి రంగా అభిమానులు అంటున్నారు.
తుళ్లూరులో రాజధాని మహిళలు చేపట్టిన ఆందోళనకు మంగళవారం టీడీపీ నేత వంగవీటి రాధా మద్దతు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ జిల్లాలో అయితే సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారో ఆ జిల్లాకే వెన్ను పోటు పొడిచాడని విమర్శించారు. వైఎస్ జగన్ సర్కార్ 30 రాజధానులు చేసుకున్నా, తమకు తెలిసన ఏకైక రాజధాని అమరావతే అని ఆయన అన్నాడు.
విజయవాడ నగరంలో తన తండ్రి వంగవీటి రంగా దీక్షలో కూర్చొని ఉండగా హత్యకు గురైన విషయాన్ని రాధా మరిచిపోయినట్టున్నాడని రంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీక్షలో కూర్చున్న నేతను అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా హత్య చేశారని, అప్పుడు ఎవరి పాలనలో ఈ దారుణం జరిగిందో రాధా మరిచిపోయినట్టున్నాడని వారు వాపోతున్నారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, కోడెల శివప్రసాద్ హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా…కన్న తండ్రిని అంతమొందించిన వారి పక్కన చేరిన రాధా రంగా ఆత్మ క్షోభించేలా ప్రవర్తిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రంగా అభిమానులుగా ఆయన హత్యను జీర్ణించుకోలేకున్నామని, కానీ రాధా మాత్రం అవన్నీ మరిచిపోయి తన రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన జిల్లాకు సీఎం వెన్నుపోటు పొడిచాడని ఆరోపిస్తున్న రాధా…హత్య చేసిన వారికి అండగా నిలుస్తూ తండ్రికి తాను ఏ పోటు పొడుస్తున్నాడో కూడా చెబితే బాగుంటుందని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.