వైసీపీకి మేమంటే హడల్, 151మంది ఎమ్మెల్యేలున్నా.. చంద్రబాబు పేరు తలుచుకుంటూ వైసీపీ నేతలు పడుకుంటారని.. నారా లోకేష్ చేసిన కామెడీ సరిపోలేదేమో.. ఆయనకంటే ఎక్కువగా ఫన్ క్రియేట్ చేస్తున్నారు ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దియోధర్. వైసీపీపై తనకున్న విద్వేషాన్ని పదే పదే తన ట్వీట్లతో బైటపెట్టుకునే సునీల్.. మరోసారి అలాంటి అవాకులు చెవాకులే పేలారు. అంతర్వేది ఘటనలో అసలైన దోషుల్ని పట్టుకోవాలని సీఎం జగన్ కి సవాల్ విసిరారు. పనిలో పనిగా ఏపీలో బీజేపీ అంటే వైసీపీ భయంతో వణికిపోతోందంటూ అల్టిమేట్ కామెడీ పండించారు.
తేనెతుట్టె ను తగలబెట్టే క్రమంలో అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక ఆధారాలున్నా కూడా హిందువులపై దాడి, ఆలయాల విధ్యంసం, విద్రోహ చర్య, సీబీఐ ఎంక్వయిరీ, ఎన్ఐఏ ఎంక్వయిరీ అంటూ మతం రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీ నేతలు. ఏదైనా ప్రమాదం జరిగితే సహాయక చర్యల కోసం నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి వెళ్లారంటే ఓ అర్థం ఉంది, రథం కాలి బూడిదైతే.. వేలాదిమంది కాషాయం కండువాలు, జెండాలు పట్టుకుని అంతర్వేది వెళ్లారంటే ఏమనుకోవాలి.
ఆ చిన్న ఊరిలో జరగరానిది ఏదైనా జరిగి, దొమ్మీలు, గొడవలతో స్థానికులు అల్లాడిపోతే దానికి కారణం ఎవరు? అల్లర్లు జరిగే అవకాశం ఉందని బందోబస్తు పెంచి, హౌస్ అరెస్ట్ లు చేస్తే దానిపై కూడా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం.
దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రకంగా ఎంట్రీ దొరికింది. ఏపీలో ఆ అవకాశం లేకపోవడంతోనే ఇలాంటి మత ఘర్షణలకు సిద్ధమవుతోంది.ప్రత్యేక హోదా పాపాన్ని కూడా ఎలాగోలా కడిగేసుకోవాలని చూస్తున్న కమలదళం.. అగ్నిప్రమాదాలను సాకుగా వాడుకోవాలని చూస్తోంది.