మహిళా నేతలే టార్గెట్.. కేటుగాడి కొత్త ప్లాన్

ఆడవాళ్లంటే.. ఏమీ తెలియదు, ఈజీగా బుట్టలో పడేయొచ్చని అనుకున్నాడేమో వరసబెట్టి మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు ఓ కేటుగాడు. ముందుగా తాను సీఎం పేషీలో పనిచేసే వ్యక్తినంటూ మాట కలుపుతాడు. …

ఆడవాళ్లంటే.. ఏమీ తెలియదు, ఈజీగా బుట్టలో పడేయొచ్చని అనుకున్నాడేమో వరసబెట్టి మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు ఓ కేటుగాడు. ముందుగా తాను సీఎం పేషీలో పనిచేసే వ్యక్తినంటూ మాట కలుపుతాడు.  ఆ తర్వాత మీ నియోజకవర్గం, లేదా మీ ప్రాంతంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారని.. మీ ప్రాంతం వారికి ఎక్కువగా రుణాలు మంజూరు చేయాలని చెప్పారని ఆశపుట్టిస్తాడు. ఏమాత్రం లొంగినా అడ్డంగా బుక్కవడం ఖాయం.

తాజాగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ఈ ఫేక్ కాల్ రిసీవ్ చేసుకున్నారు. సీఎం పేషీలో పనిచేసే జగజ్జీవన్ గా తనని తాను పరిచయం చేసుకున్న ఆ కేటుగాడు.. చిలకలూరి పేట నియోజకవర్గంలోని పేదలకు ఎక్కువ రుణాలు మంజూరు చేయాలని సీఎం తనకు టార్గెట్ పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. అయితే రుణం కావాలంటే ముందుగా కాషన్ డిపాజిట్ చెల్లించాలని కండిషన్ పెట్టాడు.

వాడి మాటలు అనుమానాస్పదంగా ఉండటంతో.. వాడిని లైన్లోనే ఉంచి డీజీపీకి, గుంటూరు అర్బన్ ఎస్పీకి సమాచారం ఇచ్చారు. సీఎం పేషీలో కూడా ఆ పేరుతో ఎవరైనా ఉన్నారా అని ఎంక్వయిరీ చేశారు. వాడి సమాచారాన్ని పోలీసులు ట్రేస్ చేసే వరకు వాడితో మాట్లాడి ఫోన్ పెట్టేశారు. 

ఎమ్మెల్యే రజినికి ఎదురైన ఈ ఫేక్ కాల్ అనుభవం.. కొద్దిరోజుల క్రితం మరో మహిళా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కి కూడా ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం మీ నియోజకవర్గానికి 3 కోట్ల రూపాయలు కేటాయించిందని, లబ్ధిదారుల వాటా కింద ముందు 10శాతం జమచేస్తే మిగతా మొత్తం విడతల వారీగా విడుదలవుతుందని ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పేరుతో ఓ వ్యక్తి ఉషశ్రీ చరణ్ కు ఫోన్ చేశాడు. ఆమె కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించి పోలీసులకు సమాచారమిచ్చారు. వాడి మోసం నుంచి చాకచక్యంగా బైటపడ్డారు.

ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన జకియా ఖానమ్ కి కూడా జగజ్జీవన్ అనే పేరుతోనే ఫేక్ కాల్ వచ్చింది. ఆమె కూడా వెంటనే అప్రమత్తమై పోలీసులకి సమాచారమిచ్చారు. నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు మహిళా ప్రజా ప్రతినిధులకు ఇలాంటి ఫేక్ కాల్స్ రావడం గమనార్హం. వీటిపై ఫోకస్ పెట్టిన పోలీసులు.. అనుమానితుడిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. త్వరలో వాడిని సాక్ష్యాధారాలతో మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పారు. 

రాష్ట్రాన్ని పున‌ర్నిర్మించుకుంటున్నాం

జగన్ ని చూసి నేర్చుకో