రాజకీయాల్లోకి రాకముందు పరిపూర్ణానంద స్వామి మాటలకు విలువ, గౌరవం ఉండేది. రాజకీయాల్లోకి రావడం, నోటికొచ్చిందల్లా మాట్లాడుతుండడంతో ఉన్న గౌరవం కాస్త పోగొట్టుకున్నారు. ఒక దశలో హద్దులు దాటి నోరు పారేసుకోవడంతో కత్తి మహశ్తో పాటు సదరు స్వామిని తెలంగాణ సర్కార్ ఆరు నెలల పాటు నగర బహిష్కరణ కూడా చేయడం తెలిసిందే. దీన్నిబట్టి స్వామి వాక్కు ఏంటో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆయన నోరు పారేసుకున్నారు. తనకు బాగా తెలిసిన విద్యనే మరోసారి ప్రదర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని మరోసారి విమర్శ చేయడం గమనార్హం.
కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని యత్నించారన్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రయత్నించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ సంగతినే తాజాగా స్వామి గుర్తు చేశారు.
కేరళ కూర్గ్‌లో కొండ జాతి గిరిజనులను టిప్పు సుల్తాన్ ఉచకోత కోశారని పరిపూర్ణానంద తెలిపారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాలనుకున్న జగన్ ఆలోచన ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. తుగ్లక్ సుల్తాన్, తుగ్లక్ బాద్షాలు తయారవుతున్నారని… ప్రభుత్వాన్ని దింపి తీరుతామని ఆయన హెచ్చరించారు. జగన్‌కు జైళ్లలో వేయడం ఆనవాయితీగా మారిందన్నారు. జైల్ భరో చేసి జైళ్లను నింపుదామన్నారు. హిందువులు అందరినీ కేసులు పెట్టి లోపల వేసినా సిద్ధంగా ఉండాలని పరిపూర్ణానంద పిలుపునిచ్చారు.
మనుషుల మధ్య ప్రేమ పంచాలని, పెంచాలని ఏ మతమైన చెబుతుంది. కానీ హిందూమతానికి ప్రతినిధిగా చెప్పుకునే స్వామీజీలు మతం, కులం పేర్లతో సమాజాన్ని విడదీయాలనే కుట్రలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఏం జరిగిందని మతాల ప్రస్తావన తేవడం? జగన్ పరిపాలనలో హిందువుల ఆలయాలు ఎక్కడ కూలాయ్?
ఇదే టీడీపీ-బీజేపీ కూటమి నేత్వంలో ఏపీలో పాలన సాగిస్తున్న రోజుల్లో విజయవాడలో పదుల సంఖ్యలో గుడులు కూలగొట్టడం పరిపూర్ణానందస్వామి దృష్టికి వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పదేపదే మత వైషమ్యాలు రెచ్చగొట్టేలా పరిపూర్ణానంద స్వామి మాట్లాడ్డాన్ని సమాజం హర్షించడం లేదు.