ఐపీఎల్ ఆటగాళ్ల ఒప్పందం ధరల విషయంలో పాత రికార్డు మరోసారి చోటు చేసుకుంది. టీమిండియా జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ తో ఒప్పందానికి గానూ లక్నో జట్టు రికార్డు స్థాయి ధరను చెల్లించడానికి సై అన్నట్టుగా తెలుస్తోంది. 17 కోట్ల రూపాయల ధరతో రాహుల్ కు లక్నో జట్టు కాంట్రాక్ట్ దక్కినట్టుగా తెలుస్తోంది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం ఇది. అయితే ఇది వరకూ ఒక ఆటగాడు ఇదే స్థాయి రెమ్యూనిరేషన్ ను పొందాడు. అతడే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ. ఇతడు మంచి ఊపు మీద ఉన్నప్పుడు బెంగళూరు జట్టు సరిగ్గా ఇదే మొత్త కాంట్రాక్ట్ ను ఆఫర్ చేసింది. 2018లోనే పదిహేడు కోట్ల రూపాయలతో కొహ్లీకి ఆర్సీబీతో ఒప్పందం కుదిరింది.
అయితే ఇప్పుడు కొహ్లీ రేంజ్ ఆ స్థాయిలో లేదు. ఇటీవల అతడి ఒప్పందం ధర తగ్గినట్టుగా వార్తలు వచ్చాయి. కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంతో ఆర్సీబీ జట్టు కొహ్లీకి రెమ్యూనిరేషన్ ను తగ్గించినట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడు కేఎల్ రాహుల్ ఊపు మీదకు వచ్చాడు. టీమిండియాకు కెప్టెన్సీ వహించేంత వరకూ వెళ్లాడు. ఇలాంటి క్రమంలో లక్నో జట్టుకు కెప్టెన్ అవసరం కూడా ఉండటంతో రాహుల్ కు కలిసి వచ్చినట్టుగా ఉంది. ఏడాదికి భారీ మొత్తం కాంట్రాక్ట్ తో రాహుల్ లక్నో జట్టు కెప్టెన్ అవుతున్నాడు.