ఉద్యోగుల‌పై వారి నుంచి సానుభూతి ట‌న్నుల కొద్దీ!

ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై ట‌న్నుల కొద్దీ సానుభూతిని కురిపిస్తున్నారు జ‌గ‌న్ వ్య‌తిరేక వ‌ర్గాలు. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకత‌ను త‌మ అస్త్రం మ‌లుచుకునేందుకు ఏ ఒక్క అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ని వ్య‌తిరేక వ‌ర్గాలు ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై…

ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై ట‌న్నుల కొద్దీ సానుభూతిని కురిపిస్తున్నారు జ‌గ‌న్ వ్య‌తిరేక వ‌ర్గాలు. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకత‌ను త‌మ అస్త్రం మ‌లుచుకునేందుకు ఏ ఒక్క అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ని వ్య‌తిరేక వ‌ర్గాలు ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై అపార‌సానుభూతిని క‌న‌బరుస్తూ ఉన్నారు. ఈ విష‌యంలో టీడీపీ సోష‌ల్ మీడియా టీమ్ విప‌రీత‌మైన యాక్టివ్ గా మార‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ ఎడ్డెమంటే తెడ్డెమ‌నే ప్ర‌చారాల‌ను అందుకోవ‌డ‌మే టీడీపీ సోష‌ల్ మీడియా విభాగం ప‌ని అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అదే ప్ర‌భుత్వ ఉద్యోగులు కోరిన‌ట్టుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌లూపి ఉంటే.. ఈ వ‌ర్గాలు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌నూ, జ‌గ‌న్ ను జాయింటుగా తిట్టిపోసేవి. అంతా క‌లిసి రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తున్నాయ‌ని త‌మ‌దైన గోబెల్స్ ప్రాపంగండాను కొన‌సాగించేవి. చెప్పిందే చెప్పి.. కృత్రిమ వ్య‌తిరేక‌త‌ను పెంచేందుకు తీవ్రంగా కృషి చేసేవి.

ఇక ఇప్పుడు ఎలాగూ ఉద్యోగులు జ‌గ‌న్ మీద మండిప‌డుతున్నారు. దీంతో టీడీపీ సోష‌ల్ మీడియా దీన్ని అవ‌కాశంగా మ‌లుచుకుంటోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను పెంచ‌డానికి దీన్నో అస్త్రంగా మార్చుకుంటోంది. ఉద్యోగుల‌పై ట‌న్నుల కొద్దీ సానుభూతి చూపిస్తూ ఉంది!

అయితే ఇదే స‌మ‌యంలో సామాన్య ప్ర‌జానీకంలో మాత్రం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై కానీ, ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌పై కానీ ఉచిత సానుభూతి ఏమీ వ‌ర్షించ‌డం లేదు. ఏ ప్ర‌భుత్వ కార్యాల‌యానికి వెళ్లినా త‌మ‌ను అక్క‌డ ఎలా చూస్తారో ఏ సామాన్యుడికీ తెలియ‌నిది కాదు. చేతులు క‌ట్టుకుని నిలుచున్నా.. అక్క‌డ చీద‌రింపులే త‌ప్ప మ‌రో త‌ర‌హా ట్రీట్ మెంట్ ఉండ‌దు.

త‌హ‌శీల్దార్ ఆఫీసుకు వెళ్లినా.. సామాన్యుడికి ఏదో సుప్రీం కోర్టుకు వెళ్లిన అనుభూతి క‌లుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు త‌ప్ప ఇలాంటి చోట మ‌రొక‌రికి కాస్త గౌర‌వ‌మ‌ర్యాద కానీ, స‌రైన ప‌ల‌క‌రింపు కానీ, స‌మ‌స్య‌ను విన‌డం కానీ ఉండదాయే! నిన్న‌లా మొన్న నియామ‌కం అయిన గ్రామ స‌చివాల‌య ఉద్యోగులు కూడా త‌మ ఆఫీసుకు వ‌చ్చే ప్ర‌జ‌లంటే చిన్న చూపుతోనే చూస్తారు! ప్ర‌భుత్వ హోదా అనేదే మ‌నిషిని అలా త‌యారు చేస్తుందేమో! ఇక టీచ‌ర్ల సంగ‌తి స‌రే స‌రి. వీరు చేయ‌ని వ్యాపార‌మే లేదు! 

మండ‌ల స్థాయి ప‌ట్ట‌ణాల్లో వ‌డ్డీ వ్యాపారం, రియ‌లెస్టేట్ వ్యాపారంలో టీచ‌ర్లు త‌న‌ముక‌లై ఉంటారు పాపం! అందేమంటే.. మాకు మీ లాగా పై ఆదాయం ఉండదంటూ ఇత‌ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను వీరు దెప్పి పొడుస్తూ ఉంటారు. ఎలాంటి రిజిస్ట్రేష‌నూ లేకుండా చీటీ పాట‌ల‌ను నిర్వ‌హించ‌డంలో కూడా టీచ‌ర్లు పేరెన్నికగ‌న్న వాళ్లే! ఈ పార్ట్ టైమ్ బిజినెస్ లు వీరి ఫుల్ టైమ్ వృత్తిని తీవ్రంగా ప్ర‌భావితం చేస్తాయి కూడా! ఈ తీరును సామాన్యులంతా ద‌గ్గ‌ర నుంచి గ‌మ‌నిస్తూనే ఉన్నారు ద‌శాబ్దాలుగా.

ఇలాంటి నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ జీతంలోని టెక్నికాలిటీస్ పై నిర‌స‌న‌ల‌కు ఎక్క‌డం ప‌ట్ల సామాన్యుల నుంచి పెద‌వి విరుపులే క‌నిపిస్తున్నాయి తప్ప‌, అయ్యోపాపం అనాల్సిన అవ‌స‌రం క‌నిపించ‌డం లేదు. అయితే ప్ర‌భుత్వ ఉద్యోగులే సీఎంల‌ను గ‌ద్దెనెక్కించినా, దించినా అనే ఫార్ములాను బాగా న‌మ్మే టీడీపీ మాత్రం ట‌న్నుల కొద్దీ సానుభూతిని కురిపిస్తోంది.