రాజకీయాల్లోకి మహిళలను లాగకూడదని పదేపదే చెప్పుకోవడమే తప్ప ఆచరించడం లేదు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి ఏదో అయ్యినట్టుంది. సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిని అమ్మా…అంటూ రాజకీయాల్లోకి లాగడం విమర్శలకు దారి తీస్తోంది. అధికార పక్షం పాలనా విధానాలపై అయ్యన్నపాత్రుడు ఎన్ని విమర్శలు చేసినా ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ ఆయన జగన్ మానసిక స్థితిపై అనుమానాలు రేకెత్తిస్తూ… హైదరాబాద్ లేదా వైజాగ్ ఆస్పత్రిలో చూపాలని వైఎస్ భారతికి విన్నవించడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడైన అయ్యన్నపాత్రుడికి జగన్ పాలన మతి పోగొడుతున్నట్టుంది. హద్దు మీరి నోరు పారేసుకోవడం తరచూ ఆయనలో చూస్తున్నాం. ఏం మాట్లాడినా తనను ఎవరూ ఏం చేయలేరనే ధీమా కాబోలు… జగన్పై ఇష్టమొచ్చినట్టు తిట్ల పురాణానికి దిగుతుంటారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అదే నైజాన్ని ప్రదర్శించారు. వైఎస్ భారతికి ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం. ఆయన ఏమన్నారంటే…
‘అమ్మా.. భారతమ్మా.. ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు గాని, మాకైతే మీ ఆయనకి ఏదో అయిందనే అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి హైదరాబాద్లో గాని, విశాఖప్నటంలో గాని ఆసుపత్రిలో చూపిం చండమ్మా’ అంటూ అయ్యన్న పాత్రుడు వైఎస్ భారతికి విన్నవించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఎయిర్పోర్ట్ కట్టాలనే సీఎం జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతూ…పైన పేర్కొన్నట్టు మాట్లాడారు. ఎయిర్పోర్ట్లు కట్టాలనే జగన్ నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు.
రాజకీయంగా, పాలనపరమైన లోపాలను ఎత్తి చూపడంలో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. కానీ వాటి మధ్యలోకి మహిళలను ఏ రకంగానైనా తీసుకురావడంలో ఔచిత్యం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. అదేదో తన మానసిక స్థితినే హైదరా బాద్లో లేక వైజాగ్ ఆస్పత్రిలో చూపింపుకుంటే… మున్ముందు ఇలాంటి అభ్యంతరకర కామెంట్స్ వచ్చే అవకాశం ఉండదని వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు.
రాజకీయ చరమాంక దశలో ఓడిపోయిన అయ్యన్నకు …రిటైర్మెంట్ దారుణంగా ఉండడంతో జగన్పై ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.