ఆర్టీసీతో చర్చలు విఫలం.. సమ్మెకు సై అంటే సై

అంతా భయపడినట్టే జరిగింది. ఆర్టీసీ కార్మికులతో వరుసగా మూడోరోజు సాగించిన చర్చలు విఫలయ్యాయి. ఆర్టీసీ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారుల కమిటీకి మధ్య జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి.…

అంతా భయపడినట్టే జరిగింది. ఆర్టీసీ కార్మికులతో వరుసగా మూడోరోజు సాగించిన చర్చలు విఫలయ్యాయి. ఆర్టీసీ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారుల కమిటీకి మధ్య జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. దీంతో రేపట్నుంచి తెలంగాణలో సమ్మె మరింత ఉధృతం కాబోతోంది. దసరా శెలవుల వేళ.. సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడుతుందనే ఆలోచన కూడా లేకుండా ఇటు ప్రభుత్వం, అటు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ మంకుపట్టుకు వెళ్లడంతో సమస్య జటిలమైంది.

ముందుగా త్రిసభ్య కమిటీ వాదన చూద్దాం. ఆర్టీసీ కార్మికులు చెబుతున్న డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు అధికారులు. కార్మికులు చెబుతున్న 26 డిమాండ్లపై సవివరంగా నోట్ తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తామని, గడువు కావాలని కార్మికుల్ని కోరుతోంది అధికారుల కమిటీ. నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ సంక్షేమానికి చాలా నిధులు కేటాయించామని, అవన్నీ కార్మికులు దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

కార్మికులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. సానుకూలంగా ఉన్నామంటూ ప్రభుత్వం బుజ్జగింపు మాటలు చెబుతోంది తప్ప, తాము ప్రతిపాదించిన ఒక్క డిమాండ్ కు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం లేదంటున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. రేపట్నుంచి సమ్మె ఉధృతం కావడం తప్పదని ప్రకటించారు. ఎస్మాకు భయపడేది లేదని, పీడీ యాక్ట్ తమకు కొత్తకాదని తేల్చిచెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్ని రోడ్లపై తిరగనివ్వమని శపథం చేస్తున్నారు.

చర్చలు విఫలమవ్వడంతో మరోవైపు అధికారులు ప్రైవేట్ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సుల్ని తిప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లను తీసుకున్నారు. 2100 ప్రైవేట్ బస్సుల్ని నడిపేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. 20వేల స్కూల్ బస్సులకు కూడా తాత్కాలికంగా పర్మిట్లు ఇచ్చారు. ఇవన్నీ రేపట్నుంచి వివిధ మార్గాల్లో తిరుగుతాయి. ఆర్టీసీ కార్మికులు అడ్డుకోకుండా, ప్రతి బస్సులో పోలీసుల్ని పెడతామంటున్నారు అధికారులు.

అంతా బాగానే ఉంది కానీ, ఈ సమ్మె ముసుగులో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ప్రయాణికుల్ని నిలువుదోపిడీ చేసే ప్రమాదముందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కచ్చితంగా రేట్లు పెంచి బస్సులు నడుపుతారని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తగా ఉండాలని కొన్ని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. అవసరమైతే ఈ దసరాకు ప్రయాణాలు ఆపుకోవాలని సూచిస్తున్నారు. మొత్తమ్మీద తాజా సమ్మెతో ఆర్టీసీకి మరిన్ని ఇబ్బందులు తప్పవు.

నరసింహారెడ్డి ఘన కీర్తిని తెలియజేసేలా..