ఏపీ కేబినెట్ లో సామాజిక సమతుల్యత ఉందని ప్రశంసించారు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏపీ కేబినెట్ లో సామాజిక న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసార్హులన్నట్టుగా స్పీకర్ స్పందించారు.
బీసీలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యత అపారమైనదన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎప్పుడో దూరం అయ్యారని, జగన్ వారిని ఆదరించారని అంటున్నారు స్పీకర్ తమ్మినేని.
ప్రత్యేకించి ఏపీ కేబినెట్ విషయంలో తమ్మినేని ప్రశంస ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే, ఈయన కూడా మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారనే వార్తలు చాన్నాళ్లుగానే వస్తున్నాయి. తనకు స్పీకర్ పదవి వద్దని, మంత్రి పదవి కావాలని తమ్మినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.
స్పీకర్ గా ఉంటే రాజకీయాలకు కొన్ని సార్లు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తన వంటి యాక్టివ్ పొలిటీషియన్ కు స్పీకర్ పదవి కంటే మంత్రి పదవే బెటరనేది తమ్మినేని వంటి వారి ఆలోచన కూడా కావొచ్చు. దీంతో స్పీకర్ గా మరొకరిని కూర్చోబెట్టి తనకు మంత్రి పదవి కేటాయించాలని సీఎం జగన్ ను తమ్మినేని కోరుతున్నారనే టాక్ కొన్నాళ్ల పాటు వచ్చింది.
మరి అసలు సంగతేమో కానీ.. తమ్మినేనికి మంత్రి పదవి లభించలేదు తాజా పునర్వ్యస్థీకరణలో. ఆయన స్పీకర్ సీటుకే అంకితం కావాల్సిందేనని స్పష్టం అవుతోంది.
ఇలాంటి నేపథ్యంలో తమ్మినేని స్పందిస్తూ మంత్రి వర్గ కూర్పును ప్రశంసించారు. తనకు కేబినెట్ లో స్థానం దక్కకపోయినా.. కేబినెట్ కూర్పును మాత్రం తమ్మినేని ప్రశంసించారు.