ఐపీఎల్ తాజా సీజన్లో ఒక్కో జట్టు కనీసం నాలుగు మ్యాచ్ లను ఆడిన నేపథ్యంలో.. పాయింట్ల టేబుల్ ఆసక్తిదాయకంగా నిలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్స్ చేరిన రెండు జట్లు ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటం గమనార్హం.
అటు చెన్నై సూపర్ కింగ్స్, ఇటు ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ ట్రోఫీని నెగ్గడం ఈ జట్లకు తెలిసినట్టుగా మిగిలిన జట్లకు తెలియదనే అనుకోవాలి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్, ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే సంచలనాలు నమోదు చేశాయి. ఈ సారి సీఎస్కే కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నాడు.
ఇప్పుడైతే ఈ రెండు జట్లూ చెరో నాలుగు మ్యాచ్ లు ఆడి కనీసం ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయాయి. దీంతో పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. వీటిలో సీఎస్కే పూర్ నెట్ రన్ రేట్ తో చివరి స్థానంలో నిలిచింది. మంగళవారం రాత్రి మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితిపై మరి కాస్త స్పష్టత వస్తుంది.
ఇక తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు కూడా తలా మూడు మ్యాచ్ లను నెగ్గాయి. రాజస్తాన్ రాయల్స్ నాలుగు మ్యాచ్ లలో మూడింట నెగ్గి టాప్ పొజిషన్లో ఉంది మెరుగైన నెట్ రన్ రేట్ తో. హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ నాలుగు మ్యాచ్ లలో రెండింటిలో నెగ్గి ఎనిమిదో స్థానంలో నిలుస్తోంది.
ఇది ప్రాథమిక దశలో ఐపీఎల్ పాయింట్ల చార్ట్ పరిస్థితి. సీజన్ సగం స్థాయి నుంచి కూడా జట్ల స్థానాల్లో చాలా మార్పులు ఉండవచ్చు.