గుమ్మడి కాయలు దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా తయారైంది టీడీపీ కమ్మ నాయకుల వ్యవహారం. తమకు తామే అన్నీ ఊహించుకుని…జగన్ సర్కార్ కుల ప్రాతిపదికన టార్గెట్ చేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. తద్వారా సమాజం నుంచి తమను తాము విడగొట్టుకుంటూ ఒంటరి అవుతున్నారు. జగన్ సర్కార్‌ను కుల ప్రాతిపదికన టార్గెట్ చేయాలనే ఎత్తుగడ వేసిందే టీడీపీ. అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా? ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారని పెద్దలు ఊరికే చెప్పలేదు.
విశాఖలో డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని కులం పేరుతో రచ్చ చేసి…జగన్ సర్కార్ మెడకు చుట్టాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులు విశ్వ ప్రయత్నం చేశారు. దళితుడైన డాక్టర్ సుధాకర్‌పై ఏపీ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని తన మీడి యాను అడ్డు పెట్టుకుని గోరింతలు కొండంతలు చేసింది. అలాగే చిత్తూరు జిల్లాలో ఓ మహిళా డాక్టర్‌ను కూడా ఇలాగే తెర ముందుకు తెచ్చి…దళితులను జగన్ సర్కార్‌కు దూరం చేయాలని టీడీపీ తనే వంతు ప్రయత్నం చేసింది.
ఇటీవల రామకృష్ణ అనే సస్పెండ్ అయిన జడ్జిని కూడా ముందుకు తెచ్చి దళిత రాజకీయానికి టీడీపీ తెరతీసింది. ఇలా చెప్పు కుంటూ పోతే టీడీపీ కుల రాజకీయాలకు అంతే లేదు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే…బీసీలను అణగదొక్కాలనే కుట్రలో భాగంగానే అని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ సామాజికవర్గం వంతు వచ్చింది.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభ వించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో పది మంది ప్రాణాలు కాలి బూడిదయ్యాయి. అయితే మనుషుల ప్రాణాల కంటే తమ కులానికి చెందిన డాక్టర్ రమేశ్ ఆస్పత్రిపై కేసే టీడీపీని ఎక్కువ బాధిస్తోంది.
మృతుల కుటుంబాలకు అందించాల్సిన సాయం, ఇతరత్రా అంశాల గురించి ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడాల్సింది పోయి….తమ సామాజిక వర్గానికి చెందిన ఆస్పత్రి కావ డంతో…అదే పెద్ద సమస్యగా భావించి చంద్రబాబు మొదలుకుని మిగిలిన నేతలంతా నెత్తినెత్తుకుని అభాసుపాలవుతున్నారు. చంద్రబాబు మొదలుకుని ఒక్కో టీడీపీ నాయకుడు రమేశ్ ఆస్పత్రిపై మాట్లాడిన “కమ్మ”ని మాటలను ఒకసారి పరిశీలిద్దాం.
“అమరావతి అందరి రాజధాని. కానీ దానిపై కుల ముద్ర వేసి మార్చారు. రాష్ట్రంలో కరోనా స్థానంలో కులవైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. రమేశ్ ఆస్పత్రిపై కుల పేరుతో కక్ష సాధిస్తున్నారు” – చంద్రబాబునాయుడు
“ప్రభుత్వం కావాలనే మంచి సంస్థలపై , పేరున్న పరిశ్రమలపై , వివిధ రంగాల్లోని ప్రముఖులపై కుల ముద్ర వేసి వేధింపులకు గురి చేస్తోంది. స్వర్ణ ప్యాలెస్ ఘటనను అడ్డు పెట్టుకుని ఒక వర్గంపై దుష్ర్పచారం చేస్తున్నారు. ఆ వర్గం వారంతా జగన్‌కు బానిసలుగా ఉండాలా? వారి వ్యాపారాలు విడిచి ఇతర రాష్ట్రాలకు పారిపోవాలా?. తప్పు చేయనప్పుడు ఏ వర్గం వారైనా ఎవరికీ భయపడాల్సిన పనిలేదు., డాక్టర్ రమేశ్‌బాబు ధైర్యంగా ప్రజల్లోకి రావాలి” – వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ
“ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వ్యక్తి పదేపదే ఒక కులం ప్రస్తావన తీసుకు రావడం దేశంలో మునుపెన్నడూ జరిగి ఉండదు. వైద్యులకు కులం ఆపాదించడం దుర్మార్గం. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రణాళిక ప్రకారం ఒక సామాజిక వర్గంపై కక్ష సాధిస్తున్నారు. ఆ క్రమంలోనే స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో డాక్టర్ రమేశ్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ రాయపాటి మమతను విచారణ పేరుతో వేధిస్తున్నారు” – అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే
“రాష్ట్రంలో కరోనా వైరస్ కన్నా కుల వైరస్ ప్రమాదకరంగా మారింది. రమేశ్ ఆస్పత్రిపై ప్రభుత్వం ఎందుకింతలా కక్ష సాధిస్తోంది? స్వర్ణ ప్యాలెస్ ఘటనకు కారకులైన అసలు దోషులను వదిలి , ప్రభుత్వం రమేశ్‌బాబు వెంట ఎందుకు పడుతోంది. అచ్చెన్నాయుడికి వైద్యం చేశారనా? కోవిడ్ నివారణ చర్యలపై చంద్రబాబుతో మాట్లాడారనా?” – దేవినేని ఉమామహేశ్వరరావు
“ప్రియమైన సోదర, సోదరీమణులకు! కులం అనే వ్యాధి కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుంది. ఇది మరింత ప్రమాదకరమైన అంటువ్యాధి. ఈ సెలెంట్ స్పైడర్స్ మిమ్మల్ని ఇందులోకి లాగడానికి లేదా నెట్టడానికి ఎంత ప్రయత్నించినా దూరంగా ఉండండి. లోక కల్యాణం కోసం అందరూ కలిసి ఉండండి” – సినీ హీరో రామ్
వీళ్లలో ఏ ఒక్కరికైనా అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించి ఆలోచించాలనే కనీస మానవత్వం లేకపోవడాన్ని గమనించాలి. అసలు డాక్టర్ రమేశ్‌బాబు కమ్మ కాబట్టే కేసులు నమోదు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిం చిందా? డాక్టర్ రమేశ్‌బాబుపై కేసు పెడితే…వీళ్లందరికీ నొప్పి ఎందుకు? మనుషుల ప్రాణాలు అప్రధానమయ్యాయా? స‌్వర్ణ ప్యాలెస్‌లో అంత ఘోర దుర్ఘటన జరిగితే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లకుండా తమ కులాభిమానాన్ని చాటడం ద్వారా అందరిలో అనుమానాలు కలిగేలా ప్రవర్తించింది టీడీపీ కమ్మ నాయకులు కాదా?
తమకు తాము కులాన్ని ప్రస్తావించడం ద్వారా మిగిలిన కులాలకు దూరం చేసుకుంటున్నదెవరు? ఎందుకీ విషయాలపై విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో తాము కమ్మ కుల పక్షపాతమే అని టీడీపీ దిగంబరంగా విజయవాడ సెంటర్‌లో నిలబడడం వాస్తవం కాదా? ఆ సంఘటనపై టీడీపీ మౌనం పాటించడానికి, దాని యజమాని తమ పార్టీకి చెందిన కమ్మ కులమనే ఏకైక కారణం కాదా?
కులం గురించి శ్రీరంగ నీతులు చెబుతూ…ఆచరణలో మాత్రం పచ్చి కుల పిచ్చితో వ్యవహరిస్తున్నది టీడీపీ కాదా? అయినా గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్టు…రమేశ్ ఆస్పత్రి వ్యవహారంలో టీడీపీ తనను తాను దోషిగా నిలబెట్టుకుంది.
స్వర్ణ ప్యాలెస్‌లో చెలరేగిన అగ్ని కీలలు టీడీపీని దహించి వేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. దానికి టీడీపీ చల్లిన కమ్మ అనే ఆజ్యమే కారణం.