చెవిలో పువ్వు రాజ‌కీయం.. ఏంటో చంద్ర‌బాబు తీరు!

నిజ నిర్ధార‌ణ క‌మిటీలు.. ఇవి తెలుగుదేశం పార్టీ స‌రికొత్త సృష్టి! సూటిగా చెప్పాలంటే తాము రాజ‌కీయం చేయ‌ద‌లిచిన అంశాల గురించి తెలుగుదేశం పార్టీ త‌నంత‌కు తానే ఒక నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వేస్తుంది. ఆ క‌మిటీ…

నిజ నిర్ధార‌ణ క‌మిటీలు.. ఇవి తెలుగుదేశం పార్టీ స‌రికొత్త సృష్టి! సూటిగా చెప్పాలంటే తాము రాజ‌కీయం చేయ‌ద‌లిచిన అంశాల గురించి తెలుగుదేశం పార్టీ త‌నంత‌కు తానే ఒక నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వేస్తుంది. ఆ క‌మిటీ క్షేత్ర స్థాయికి వెళ్లి ప‌రిశీల‌న‌లు చేస్తుంది. ఆ క‌మిటీని లోప‌ల‌కు రానిచ్చారా స‌రేస‌రి. లేక‌పోతే అంతే సంగ‌తి! నిజ‌నిర్ధార‌ణ క‌మిటీని అడ్డుకున్నారంటూ.. కాబ‌ట్టి తాము చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మేనంటూ.. ర‌చ్చ‌, ప‌చ్చ‌మీడియాలో చ‌ర్చ జ‌రుగుతుంద‌న‌మాట‌! ఇదంతా ఒక సీరియ‌ల్ గా మారింది.

అయితే ఈ చెవిలో పువ్వు రాజ‌కీయాలు చంద్ర‌బాబు నాయుడు ఇంకా ఎన్నెళ్లు చేయించాల‌నుకుంటున్నారో అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడ‌ల్లా ఈ చెవిలో పువ్వు రాజ‌కీయాలు చేస్తూ ఉంటారు టీడీపీ వాళ్లు. జ‌నాలు, చూసే వాళ్ల చెవుల్లో పువ్వులు పెట్ట‌డానికి నిజ‌నిర్ధార‌ణ క‌మిటీల‌ను ఇప్పుడు తెర‌పైకి తెచ్చారు!

అయితే ఇవ‌న్నీ 1990ల‌లో చంద్ర‌బాబు వాడుకలోకి తెచ్చిన‌ప్పుడు బాగానే న‌డిచాయేమో కానీ నేత‌ల జాత‌కాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు ఎరుక‌లోకి వ‌చ్చాకా మాత్రం.. ఇంకా చంద్ర‌బాబు త‌న పాత స్కూలు పాలిటిక్స్ నే అమ‌ల్లో పెట్టడం మాత్రం పెద్ద కామెడీ అవుతోంది.

హ‌త్యారాజ‌కీయాల్లో త‌న‌మున‌క‌లైన త‌న పార్టీ కార్య‌క‌ర్త ఒక‌రు హ‌త్య‌కు గురైతే చంద్ర‌బాబు అక్క‌డ నిజాల‌ను నిర్ధారించ‌డానికి వెళ్లారు. స‌ద‌రు హ‌తుడు ప‌లు హ‌త్యా కేసుల్లో నిందితుడు అనే విష‌యాన్ని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కుండా చంద్ర‌బాబు రాజ‌కీయ నాట‌కం సాగింది! పులి స్వారీ చేసే వాళ్లు అదే పులికి బ‌లైతే… దాని ద్వారా సానుభూతి పొందాల‌ని చూసే విఫ‌ల య‌త్నాల‌ను చేయ‌డం చంద్ర‌బాబుకు కొత్త కాదు. 

ప‌రిటాల ర‌వి హ‌త్యోదంతం ద‌గ్గ‌ర నుంచి ఇదే క‌థ‌. ఇప్పుడు చోటామోటా కార్య‌క‌ర్త‌ల స్థాయికి చంద్ర‌బాబు దిగారు. వీటితో కూడా ఏమైనా పేలాలు ఏరుకోవాల‌ని చూస్తున్నారు! ఇక ఈ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ అంటే.. అదేదో త‌ట‌స్తుల‌తో వేసేది అయి ఉంటే నిజంగా ఏదో ఆస‌క్తి క‌లిగేది. అయితే టీడీపీ వేసే ఈ క‌మిటీల్లో అంతా టీడీపీ నేత‌లే ఉంటారు. 

అంతా ప‌చ్చ చొక్కాలు వేసుకుని నిజాల‌ను నిర్ధార‌ణ చేసేందుకు వెళ్తార‌ట వీళ్లంతా!  ప్రైవేట్ ఆస్తుల్లోకి, ఇళ్ల‌లోకి కూడా చొచ్చుకుపోయి వీళ్లు నిజాల‌ను నిర్ధార‌ణ చేస్తార‌ట‌. అక్క‌డ‌కు రానీయ‌క‌పోతే మాత్రం.. తాము చెప్పింద‌ల్లా నిజ‌మైనేన‌ట్టా! ఇలాంటి క‌న్నింగ్ పాలిటిక్స్  ఎన్నింటినో చేసే చంద్ర‌బాబు అండ్ కో 23 సీట్ల‌కు ప‌రిమితం అయ్యింది. అయినా తీరు మార‌లా!