టీడీపీ నేతలు కవ్విస్తున్నారు.
పోలీసులు తగిన సమాధానం ఇస్తున్నారు.
రాష్ట్రంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లతో.. తెలుగుదేశం పార్టీ, పోలీస్ డిపార్ట్ మెంట్ మధ్య వార్ కొనసాగుతోంది. పోలీసులంతా వైసీపీ తొత్తుగా మారారని ఆమధ్య చంద్రబాబు ఆరోపణలు చేసి ఆ తర్వాత “కొంతమంది.. కొంతమంది” అంటూ తనపై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు అండ్ టీమ్ మాత్రం పోలీసులని కించపరచే ఆరోపణలు చేయడం ఆపలేదు.
చలో ఆత్మకూరు ఆందోళనల సమయంలో నన్నపనేని రాజకుమారి, అచ్చెన్నాయుడు తమ నోటిదురుసుతో కేసుల్ని ఎదుర్కున్నారు. మహిళా పోలీస్ ఆఫీసర్ ని కించపరిచేలా మాట్లాడి నన్నపనేని తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. ఆ ఎపిసోడ్ అక్కడితో ఆగిపోయినా, సోషల్ మీడియా ఫిర్యాదుల విషయంలో డీజీపీ సహా పోలీస్ డిపార్ట్ మెంట్ అంతా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏకంగా డీజీపీకే కులాన్ని ఆపాదిస్తూ ఆరోపణలు చేశారు వర్ల రామయ్య.
వర్ల రామయ్య ఆరోపణలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. డీజీపీకే కులాన్ని ఆపాదించడం సరికాదని అంటూనే వర్ల నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. దీన్ని అడ్వాంటేజిగా తీసుకుని వర్ల రామయ్య పోలీసులపై తిరిగి కేసులు పెట్టారు. పోలీసు సంఘం అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సీని కాబట్టే తనను పోలీస్ అధికారుల సంఘం నేతలు అనరాని మాటలంటున్నారని కులంకార్డు బైటకు తీశారు.
ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏంటంటే.. కులం గురించి, కించపరచడం గురించి వర్ల రామయ్య మాట్లాడటం కామెడీగా ఉంది. ఎస్సీ అయి ఉండి కూడా, గత ఎన్నికల ప్రచారంలో ఎస్సీలలో మరోవర్గం కుర్రాడిని వర్ల రామయ్య కించపరిచి మాట్లాడిన మాటల్ని ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. కేవలం ఇప్పుడు ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకునే వర్ల దీన్ని పెద్ద సీన్ గా చిత్రీకరిస్తున్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులకే ఫిర్యాదు చేయడం విడ్డూరం కాక ఇంకేంటి.
డీజీపీ వైసీపీ పక్షం అంటూ తెలుగుదేశం నేతలు స్టేట్ మెంట్లు ఇస్తుంటే ఇక వారికి న్యాయం ఎందుకు జరుగుతుంది. పోలీసుతో సున్నం పెట్టుకుని నాలుగున్నరేళ్లపాటు టీడీపీ ఎలా మనగలుగుతుంది. పక్షపాతమే నిజమైతే నాలుగున్నరేళ్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ జైలుకెళ్లాల్సిందే కదా? ఇంత చిన్న లాజిక్ ను టీడీపీ నేతలు మిస్ అవుతున్నారు.