ఒంట‌రైన జేసీ.. ఒక్కొక్క‌రూ ఫైర్!

తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితిపై వ్యాఖ్యానించిన ఆ పార్టీ నేత‌ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై స‌హ‌చ‌ర నేత‌లు విరుచుకుప‌డ్డారు. ఒక్కొక్క‌రు స్పందిస్తూ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై దుమ్మెత్తి పోశారు. 'పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నావు, నీ వ‌ల్లే పార్టీకి…

తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితిపై వ్యాఖ్యానించిన ఆ పార్టీ నేత‌ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై స‌హ‌చ‌ర నేత‌లు విరుచుకుప‌డ్డారు. ఒక్కొక్క‌రు స్పందిస్తూ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై దుమ్మెత్తి పోశారు. 'పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నావు, నీ వ‌ల్లే పార్టీకి న‌ష్టం, పార్టీలో గ్రూపులు క‌ట్టింది నువ్వే..' అంటూ తెలుగుదేశం నేత‌లు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై విరుచుకుప‌డ్డ వారిలో అనంత‌పురం మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి, గుంత‌క‌ల్ మాజీ ఎమ్మెల్యే జితేంద‌ర్ గౌడ్, మాజీ మంత్రి, పుట్ట‌ప‌ర్తి మాజీ ఎమ్మెల్యే ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిలు త‌దిత‌రులు ఉన్నారు. ఇలా వేర్వేరు సామాజిక‌వ‌ర్గానికి చెందిన టీడీపీ నేత‌లు ఒకే రోజున ప్ర‌భాక‌ర్ రెడ్డిపై విరుచుకుప‌డ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు వ‌స్తే టీడీపీ గెల‌వ‌లేద‌న్న ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానాల‌పై తెలుగుదేశం నేత‌ల‌కు తీవ్రంగా కోపం వ‌చ్చింది. పార్టీలో ప‌రిస్థితుల‌పై ప్ర‌భాక‌ర్ రెడ్డి స్పందించిన తీరును వారు అస్స‌లు స‌హించ లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా జేసీతో కొంద‌రు నేత‌లు బాహాటంగా త‌ల‌ప‌డ్డారు. వారిలో ప్ర‌భాక‌ర్ చౌద‌రి,  జితేంద‌ర్ గౌడ్ వంటి వారున్నారు. అయితే అప్ప‌ట్లో పల్లె ర‌ఘునాథ‌రెడ్డి లాంటి వాళ్లు మాత్రం జేసీతో ర‌చ్చ చేసుకోలేదు. ప్ర‌భాక‌ర్ చౌద‌రి పొడగిట్ట‌ని ప‌రిటాల వ‌ర్గం కూడా జేసీ సోద‌రుల‌తో పెద్ద‌గా విబేధించ‌లేదు. అయితే ఇప్పుడు మాత్రం జేసీ త‌ర‌ఫున మాట్లాడే వారు లేకుండా పోయారు.

గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున గెలిచి నిలిచిన ఒక్క మ‌గాడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.  జ‌గ‌న్ గాలిలో కొట్టుకుపోయిన తెలుగుదేశం నేత‌లెవ్వ‌రూ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఉనికిని నిల‌ప‌లేక‌పోయారు. అయితే ప్ర‌భాక‌ర్ రెడ్డి మాత్రం తాడిప‌త్రి మున్సిపాలిటీలో టీడీపీ జెండాను ఎగ‌రేయ‌గ‌లిగారు. ఎమ్మెల్యేగా త‌మ కంచుకోట‌ను కోల్పోయినా, వేగంగా కోలుకున్న సంకేతాల‌ను ఇచ్చారు. 

కేవ‌లం తాడిప‌త్రి మున్సిపాలిటీ విజ‌య‌మే కాదు, పార్టీ కేడ‌ర్ తో అయినా ప్ర‌జ‌ల‌తో అయినా గ‌త రెండున్న‌రేళ్ల‌లో కాస్తో కూస్తో  ట‌చ్లో ఉన్న అతి త‌క్కువ మంది టీడీపీ నేత‌ల్లో ప్ర‌భాక‌ర్ రెడ్డి ముందుంటారు. వివాద‌మో, వ్య‌వ‌హార‌మో.. ఏదోలా ఉనికి చాటుతూ ఉంటారు. మిగ‌తా వాళ్లు ఎవ్వ‌రికీ ఇంత సీనైతే లేదు. ప‌చ్చ‌మీడియాలో త‌మ స్టేట్ మెంట్లు వ‌చ్చేస్తే చాల‌నే లెక్క మిగతా టీడీపీ నేత‌ల‌ది. అందుకు భిన్నంగా ముందుకు వెళ్తున్న ప్ర‌భాక‌ర్ రెడ్డి పై ఈ బ్యాచ్ మొత్తం విరుచుకుప‌డ‌టం గ‌మ‌నార్హం.