మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘మా ’ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాకుండానే వర్గాలుగా విడిపోయి, పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.
గతంలో టాలీవుడ్‌లో ఇలాంటి ధోరణులు ఎప్పుడూ లేవని సీనియర్ నటులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మా ’ ఎన్నికలపై సీనియర్ హీరో సుమన్ తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
నెల్లూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మా ’ ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను సుమన్ ఖండించారు. సినీ ఎన్నికల్లో పోటీ చేయడం తనకిష్టం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నట్టు తెలిపారు. మరీ ముఖ్యంగా రెండు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణించడం తనకెంత మాత్రం ఇష్టం లేదని తేల్చేశారు. ఇక టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై ఆయన మనసులో మాట చెప్పారు.
డ్రగ్స్ అనేది కేవలం సినీ రంగానికే పరిమితం కాదన్నారు. అన్ని రంగాల్లో డ్రగ్స్ జాడ్యం ఉందన్నారు. అయితే రంగుల ప్రపంచం కావడంతో సినీ రంగంలో డ్రగ్స్ వ్యవహారానికి ఎక్కువ ప్రచారం వస్తోందన్నారు. డ్రగ్స్ తీసుకోడానికి అనేక కారణాలున్నాయని సుమన్ అభిప్రాయపడ్డారు. కఠిన శిక్షలతో మాత్రమే డ్రగ్స్ మహమ్మారిని పారదోలవచ్చన్నారు.