భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బండి సంజయ్ ఒకింత సంచలన ప్రకటనే చేశారు. పొలిటికల్ గాసిప్ తరహాలో ఆయన ఒక అంశం గురించి మాట్లాడారు. ఇది అయిపోయిన జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి కావడం గమనార్హం. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తమ పార్టీ ముఖ్య నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయినట్టుగా బండి సంజయ్ చెప్పారు.
ఆ సమావేశం సందర్భంగా కేసీఆర్ ఒక ప్రతిపాదన పెట్టారట. అదేమిటంటే.. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని బీజేపీకి ఇస్తామంటూ అమిత్ షా వద్ద ప్రతిపాదించారట కేసీఆర్! అయితే ఆ ఆఫర్ కు ససేమేరా అన్నారట అమిత్ షా.
టీఆర్ఎస్ మద్దతు అక్కర్లేదని, జీహెచ్ఎంసీ మేయర్ పదవి కూడా బీజేపీకి అక్కర్లేదని అమిత్ షా కేసీఆర్ మొహం మీదే చెప్పారట. అంతేకాదట.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని కూడా కేసీఆర్ కు స్పష్టం చేశారట అమిత్ షా! ఇదీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుల వారు చెబుతున్న హాట్ న్యూస్. జీహెచ్ఎంసీ ఫలితాల్లో హంగ్ తరహా పరిస్థితి ఏర్పడిన సంగతి నిజమే కానీ, కేసీఆర్ వెళ్లి మరి బీజేపీ కి సీటును ఆఫర్ చేసి ఉంటారా? అంత వరకూ ఢీ అంటే ఢీ అని ముఖాముఖి పోరులో తలపడిన వారి వద్దకే వెళ్లి.. మీరే సీటు తీసుకోండి.. అని కేసీఆర్ ఆఫర్ ఇచ్చి ఉంటారా? అనేవి కనీస ఆలోచన ఉన్న వారికి వచ్చే సందేహాలు. వాటన్నింటితో నిమిత్తం లేకుండా పొలిటికల్ హాట్ న్యూస్ నే చెప్పారు బండి సంజయ్.
అయినా జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయాకా చాలా జరిగింది. ఉప ఎన్నికల్లో బీజేపీ బోర్లా పడింది. త్వరలోనే హుజూరాబాద్ బై పోల్. ఇందులో మాత్రం టీఆర్ఎస్ గెలిచే ప్రసక్తి లేదని అంటున్నారు బండి సంజయ్. తలకిందుల ఫీట్లు చేసినా టీఆర్ఎస్ గెలవలేదని బండి సంజయ్ అంటున్నారు.