ఒకే ఏడాదిలో మూడు రాష్ట్రాల్లో సీఎంలను మార్చేసింది భారతీయ జనతా పార్టీ. ఉత్తరాఖండ్ సీఎం పదవి నుంచి తీరథ్ సింగ్ రావత్ ను సాగనంపారు. ఆ వెంటనే కర్ణాటక సీఎం యడియూరప్ప వంతు. ఇప్పుడు గుజరాత్ సీఎం రూపానీ వంతు. కొన్ని నెలల వ్యవధిలో మూడు రాష్ట్రాల్లో సీఎంలను మార్చేసింది కమలం పార్టీ. కొత్త సీఎంలను తెర మీదకు తీసుకొచ్చింది.
ఇలా వరసగా ముఖ్యమంత్రుల మార్పు కు బీజేపీ రకరకాల రీజన్లను చెబుతూ ఉంది. అయితే అన్నీ అనధికారిక రీజన్లే! అధికారికంగా ఫలానా కారణం చేత సీఎంలను మార్చినట్టుగా ఎక్కడా చెప్పడం లేదు. యడియూరప్ప విషయంలో విపరీతమైన అవినీతి కారణం అనేది అనధికార సమాచారం. యడియూర్ప విషయంలోనే వయసు రీజన్ ను కూడా అనధికారికంగా ప్రస్తావించారు. అయితే ఆయనను సీఎం చేసే టైమ్ కే ఆయన వయసు 75 దాటింది. మరి ఎక్కించడానికి అడ్డు రాని వయసు, తప్పించడానికి మాత్రం కారణమైందా? అనేది కొశ్చన్.
ఇక రూపానీని తప్పించడానికి కారణం ఆదానీ అనే టాక్ ఒకటి వినిపిస్తోంది. ఆదానికి నచ్చకపోవడం వల్లనే రూపానిని తప్పించారని, పటేళ్లను బుజ్జగించడానికి కూడా ఈ మార్పును ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా అనధికార ప్రచారమే! ఏదేమైతేనేం.. మూడు నెలల్లో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చేసింది కమలం పార్టీ. ఈ విషయంలో కాంగ్రెస్ గుర్తుకు వస్తే పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తమ హవా జరిగిన రోజుల్లో ముఖ్యమంత్రుల సీట్లతో మ్యూజికల్ చెయిర్స్ ఆట ఆడింది. అధికారం మత్తులో కాంగ్రెస్ కు తనేం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు. బహుశా బీజేపీకి కూడా అలాంటి ఫీలింగే ఇప్పుడేమైనా మొదలైందా? అనే సందేహం కలగడం సహజమే. వరసగా రెండో పర్యాయం అధికారం చేపట్టడం, కేంద్రంలో తిరుగులేని మెజారిటీ ఉండటం, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోడీ పేరుతోనే బీజేపీ వెళ్తుండటం.. ఈ పరిణామాలన్నింటి పర్యావసనమే ఇలా ముఖ్యమంత్రులను మార్చేయడమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాబోయే రోజుల్లోని బీజేపీ రాజకీయ పరిణామాలు ఈ అంశంపై మరింత స్పష్టతను ఇచ్చే అవకాశం ఉంది.