టీమిండియా కోచ్ రవిశాస్త్రి కి ఇప్పటికే భారత క్రికెట్ ఫ్యాన్స్ లో ఉన్న ఇమేజ్ చాలా పలుచన. కుంబ్లే తన పని తను చక్కగా చేసుకుంటున్న దశలో అనూహ్యంగా రవిశాస్త్రి కోచ్ అయ్యారు. అంతకు ముందు కోచ్ పదవికి ఇంటర్వ్యూలు జరిగితే వాటికి హాజరు కాకుండా శాస్త్రి ఆన్ లైన్ లో పలకరించాడట. డైరెక్టు ఇంటర్వ్యూలు అని బీసీసీఐ చెబితే, శాస్త్రి మాత్రం ఎక్కడో ఉండి ఆన్ లైన్ లో అటెండ్ అవుతానంటూ చెప్పాడట. అయితే ఆ తర్వాత కొహ్లీ కారణం చేత కుంబ్లే ఆ హోదా నుంచి తప్పుకున్నాడు, శాస్త్రికి అడ్డు లేకుండా పోయింది.
శాస్త్రి మంచి మాటకారి, మంచి కామెంటరేటర్ అనేది ఈ తరానికి తెలిసిన విషయం. ఒకప్పటి ఆటగాడిగా శాస్త్రి రికార్డులు ఎవ్వరికీ పట్టవు కూడా. మరీ చెప్పుకోదగినవి కూడా అందులో ఏమీ లేవు. ఇక కోచ్ అయ్యాకా శాస్త్రి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతూ వస్తోంది. ఈ విషయంలో పలుసార్లు నెటిజన్లు హద్దుమీరారు కూడా. అయితే శాస్త్రి ఎవ్వరేమనుకుంటే తనకేం అన్నట్టుగా సాగుతున్నాడు. ఓడినా శాస్త్రి బాధ్యత ఉండదు, గెలిచినా ఎవరూ కీర్తించరు అన్నట్టుగా మారిపోయింది ఈ స్వదేశీ కోచ్ పరిస్థితి!
ఈ క్రమంలో ఇక తప్పుకునేందుకు సమయం ఆసన్నమవుతోంది. 60 యేళ్ల వయసు దగ్గరపడుతుండటంతో శాస్త్రి టీమిండియా కోచ్ హోదా నుంచి తప్పుకోవాలి. అది నియమం. మరి ఇలా తప్పుకోవడానికి రెడీ అవుతున్న తరుణంలో శాస్త్రి తీవ్రంగా వివాదాస్పదం అవుతున్నాడు.
తన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకుని తను కరోనాకు గురై, తనతో పాటు టీమిండియా సిబ్బందిని కూడా ఆ ప్రమాదంలోకి నెట్టి, ఐదో టెస్టు రద్దు అయ్యేంత వరకూ పరిస్థితిని తీసుకువచ్చాడంటూ శాస్త్రిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి శాస్త్రి, కొహ్లీ లు బీసీసీఐ పర్మిషన్ ను కూడా తీసుకోలేదని సమాచారం. పరిస్థితి ఇలా ఉందంటే బీసీసీఐ పరువు కూడా పోతుంది. అందుకే బోర్డు కామ్ గా ఉన్నట్టుగా ఉంది.
ఇక తనపై వస్తున్న విమర్శలపై శాస్త్రి కౌంటర్ ఇస్తున్నాడు. ఇంగ్లండ్ లో ఎలాంటి కరోనా రిస్ట్రిక్షన్స్ లేవని, అలాంటప్పుడు తనను అనడం ఏమిటంటూ శాస్త్రి ప్రశ్నిస్తున్నాడు. కాస్తైనా బాధ్యత ఉండే వారు వేసే ప్రశ్న కాదిది. ఇంత కరోనా పరిస్థితుల్లో ఆ బుక్ మార్కెట్ చేసుకోకపోతే ఏమయ్యేది? కోచ్ గా ఇంగ్లండ్ వెళ్లింది టీమ్ కోసమా లేక ఇలా వ్యక్తిగత ఈవెంట్లను చూసుకోవడానికా? ఇన్నాళ్లూ శాస్త్రిని నెటిజన్లు ట్రోల్ చేయడంలో తప్పేం లేదన్నట్టుగా ఉంది ఆయన తీరు!
ఏడెనిమిది కోట్ల రూపాయల వార్షిక వేతనం తీసుకుంటూ.. ఆటగాళ్లకు హద్దులూ, శుద్ధులు చెప్పాల్సిన కోచ్ తన వ్యక్తిగత వ్యాపారం కోసం పాకులాడి, ఒక టెస్టు మ్యాచ్ రద్దు వరకూ తీసుకొచ్చి.. మళ్లీ షేమ్ లెస్ గా రవిశాస్త్రి ఎదురుదాడి చేస్తున్నాడు. ఇంత వరకూ టీమిండియా కోచ్ లలో ఇంత లేకిగా ప్రవర్తించిన వారు, అభిమానుల చేత ఇలా ఛీదరించుకుంటున్న మాజీ ఆటగాళ్లు ఎవ్వరూ లేరు. అందరి మీదా గౌరవమే ఉంటుంది. అయితే శాస్త్రి మాత్రం తనకు అలాంటివేమీ అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.