ఏపీ అసెంబ్లీ చేత ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్రపడటంతో తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది. తాము భూములు కొని పెట్టుకున్న అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడని తెలుగుదేశం పార్టీకి ఏ మూలో ఆశ ఉన్నట్టుంది. అది కాస్తా అడియాస అయ్యే సరికి తెలుగుదేశం పార్టీ షాక్ కు గురి అయినట్టుగా ఉంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు వరసగా స్పందించేశారు.
మూడు రాజధానులకు తాము వ్యతిరేకం అని ప్రకటించుకున్నారు. అంతే కాదట గవర్నర్ నిర్ణయంపై తాము కోర్టుకు వెళ్లబోతున్నట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించారు. గవర్నర్ నిర్ణయంపై హై కోర్టులో పిటిషన్ వేయనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వరసగా హై కోర్టును ఆశ్రయించడం తెలిసిన సంగతే. ఈ క్రమంలో రాజధాని అంశం మీద కూడా తెలుగుదేశం పార్టీ హై కోర్టునే ఆశ్రయిస్తుందట!
అసెంబ్లీ చేత ఆమోదం పొందిన , గవర్నర్ చేత కూడా ఆమోదించబడిన ఈ బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ పిటిషన్ పై హై కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇక తరువాయి అంకం. ఈ బిల్లు మండలిలో పెండింగ్ లో ఉంది అనేది తెలుగుదేశం పార్టీ వాదన. బహుశా హై కోర్టులో కూడా అదే వాదనే వినిపిస్తుందేమో! కానీ.. మండలికి ఏ బిల్లు అయినా కొన్ని రోజుల పాటే పెండింగ్ లో పెట్టే అర్హత ఉంటుందని, ఆ తర్వాత ఆమోదం పొందినా పొందకపోయినా.. అసెంబ్లీ ఆమోదిస్తే చాలనే రాజ్యాంగబద్ధమైన వాదన వినిపిస్తూ ఉంది ప్రభుత్వం. ఇక సెలెక్ట్ కమిటీ అప్పట్లో ఎలాంటి కార్యరూపం దాల్చని సంగతి తెలిసిందే. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ఆశలన్నీ హైకోర్టు మీదే ఉన్నాయని ఆ పార్టీనే ప్రకటించేసినట్టైంది.