రాజకీయ నాయకులు అంటే దర్జా ఒలకబోస్తారని, వారికి ఎదురులేదని సినిమాలు చూసి లేక వారి బయట జీవితాలు చూసి అనుకుంటే పొరపాటే. పీత బాధలు పీతవి అన్నట్లుగా వారి బాధలు వారివి. అధినాయకుడు ఎలా చేయమంటే అలా చేయకతప్పదు కదా. తెలుగుదేశం పార్టీలో ఇపుడు చంద్రబాబు అలానే టార్చర్ పెడుతున్నారని బయటకు వచ్చిన మాజీ తమ్ముడు పంచకర్ల రమేష్ బాబు చెబుతూంటే నమ్మకతప్పదు కదా.
విశాఖ రాజధానిగా పనికిరాదు అని చెప్పండి, అమరావతికే జై కొట్టండి అంటూ టీడీపీ ఆఫీస్ నుంచి ప్రతీ రోజూ పార్టీ నాయకులకు మెసేజుల మీద మెసేజులు. అలాగే ఫోన్లతో వెంటాడుతూ టీడీపీ పెద్దలు అతి పెద్ద టార్చరే పెడుతున్నారని పంచకర్ల వంటి నాయకులు విడమరచి చెబుతూంటే నోరెళ్ళబెట్టి వినాల్సిందే.
మరీ ఇంత దారుణంగా ప్రజాభిప్రాయాన్ని కబలించే యత్నం చేస్తూ తమ అనుకూల మీడియాలో లేని దాన్ని ఉన్నట్లుగా రాయిస్తూ పసుపు శిబిరం చేస్తున్న విన్యాసాలు మాజీ తమ్ముళ్ళ నోటివెంట విన్నాక షాక్ తినాల్సిందేగా మరి.
విశాఖ నుంచి గెలిచి అక్కడి ప్రజల మనోభావాలను అనుగుణంగా తాము నడచుకునే స్వేచ్చ టీడీపీలో లేదని, అమరావతి రాజధాని నినాదం అందుకోమంటూ తమను తెగ వేధిస్తున్నందుకే పార్టీ మారామని పంచకర్ల బాబు గుట్టు రట్టు చేశారు.
విశాఖ నాలుగు సీట్లు ఇచ్చి బాబుకు విపక్ష హోదా ఇచ్చింది. అటువంటి నగరం మీద విషం చిమ్మడం ఎందుకు బాబూ అని ప్రశ్నించే తమ్ముళ్లకు అక్కడ చోటు లేదుట. అందుకే ఉత్తరాంధ్రా అభివ్రుధ్ధి కోసం వైసీపీ లో చేరానని పంచకర్ల చెబుతున్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే ఉత్తుత్తి ఉద్యమాలకు ఊపిరిపోయడానికి టీడీపీ, బాబు పడే ఆరాటం బట్టబయలైపోయినట్లేగా మరి.