తన వయసైపోతుందని తొందర పడుతున్నారో లేక, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే టీడీపీకి భారీ మెజార్టీ వస్తుందని భ్రమపడుతున్నారో తెలియదు కానీ.. చంద్రబాబు మాత్రం పూర్తి ఆవేశంలో ఉన్నారు. అర్జెంట్ గా జగన్ ను దించేసి, తాను గద్దెనెక్కాలని చూస్తున్నారు, యువరాజుకి పట్టాభిషేకం పూర్తి చేసి టీడీపీ అధికారంలో ఉండగానే ఆయనకు పార్టీని అప్పగించాలనుకుంటున్నారు.
అదిప్పుడల్లా జరిగే పరిస్థితి లేదు, ఎన్నికలు కనుచూపు మేరలో కూడా లేవు. కచ్చితంగా మూడున్నరేళ్లు వేచి చూడాల్సిందే. అయితే బాబు మాత్రం అన్నిరోజులు ఆగేలా లేరు. ఆయన వాలకం చూస్తుంటే ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహించాలని, జూమ్ లో తాను ప్రచారం చేసి టీడీపీని గెలిపించేయాలని కలలు కంటున్నారు. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు, ప్రజలారా తిరగబడండి, అమరావతి కోసం పోరాడండి అంటూ ప్రేరేపిస్తున్నారు.
జగన్ ప్రజా వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు రోజూ రాయించే వార్తలు కాకుండా ప్రత్యేకంగా పుస్తకాలు వేయిస్తున్నారు. ఇలా ఒకటేంటి.. శత విధాల చంద్రబాబు తొందర పడుతున్నారు. అధికారంపై అందరికీ ఆశ ఉంటుంది. ఆల్రెడీ అధికారంలో ఉన్నవారు దాన్ని నిలబెట్టుకోవాలంటే అది ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి.
ప్రతిపక్షంలో ఉన్నవారికి అధికారం కావాలంటే.. తాను ఏంచేయగలనే ప్రజలకు సరిగా వివరించగలగాలి. ఏపీలో అదే జరిగింది. విభజితాంధ్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రిగా బాబు ఓ విఫల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. తొలి ప్రతిపక్షనేతగా తన సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం రగిలించిన ఘనత జగన్ కే దక్కింది. అప్పుడు కూడా జగన్ చంద్రబాబులా తొందరపడలేదు.
ఎన్నికల సమయం కోసం ఎదురు చూశారు, ఓపిక పట్టారు, ఎమ్మెల్యేలు చేజారుతున్నా నమ్మకాన్ని కోల్పోలేదు. తన పార్టీ టికెట్ పై గెలిచి, ఫిరాయించి మంత్రి పదవులు తీసుకుని చివరకు తననే ఇబ్బంది పెడుతున్నా సహనంతో భరించారు. “మీరు కొట్టారు మేం తీసుకున్నాం.. మా టైమ్ వస్తుంది మేం ఇంకా గట్టిగా కొడతామన్నారు”. అన్నట్టే టైమ్ చూసి టీడీపీని గట్టి దెబ్బే కొట్టారు. కోర్టు కేసులు వాయిదాలతో ఇబ్బంది పెట్టినా, పాదయాత్రలో అడ్డంకులు సృష్టించినా, ఎయిర్ పోర్ట్ లో హత్యాయత్నం చేసినా.. దేనికీ వెరవలేదు.
కానీ చంద్రబాబు పరిస్థితి అలా లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బాబులో అధికారం కోల్పోయామన్న బాధ, ఆక్రోషం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుటికిప్పుడు కోర్టులు కానీ, కేంద్రం కానీ జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలు పెట్టాలనేది చంద్రబాబు దురాలోచన.
40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకునే చంద్రబాబుకి కనీసం జగన్ కి ఉన్నపాటి సహనం లేదు. తొందరగా మరోసారి సీఎం అయిపోవాలి, రాష్ట్రాన్ని మరింత నాశనం చేసేయాలి.. ఎప్పుడూ బాబు ఆలోచన ఇదే.