తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు బాగానే కన్పించింది.. కానీ, సీట్లు మాత్రం అత్యంత దారుణంగా దక్కాయి. 'ఎక్కడ తేడా కొట్టింది.?' అంటూ తెలుగుదేశం పార్టీ తెగ గించేసుకుంటోంది. ఎన్నికల ముందర తాయిలాలు గట్టిగా పనిచేయబట్టి, ఆ ఓటు బ్యాంకు అలా నిలబడింది తప్ప.. అదేదో 'బలం' అనుకుంటే పొరపాటేనని సాక్షాత్తూ టీడీపీ నేతలే ఆఫ్ ది రికార్డ్‌గా ముచ్చటించుకుంటున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమయ్యిందో.. రేప్పొద్దున్న ఆంధ్రప్రదేశ్‌లోనూ టీడీపీకి అదే గతి పడుతుందన్న ముందస్తు అంచనాలతో, ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు మాత్రం, తనదైన స్టయిల్లో పబ్లిసిటీ స్టంట్లు చేసుకుంటూ పోతున్నారు. సొంత జిల్లా పర్యటనలో భాగంగా, కుప్పం నియోజకవర్గ ప్రజల ముందు చంద్రబాబు తన గోడు వెల్లగక్కుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
'చెయ్యాల్సినదానికన్నా ఎక్కువే చేశాం.. ఎక్కడ తేడా కొట్టిందో అర్థం కావడంలేదు.. అయినా, బాధ్యతగల ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం..' అంటూ చంద్రబాబు చెప్పుకున్నారు. ఇక్కడిదాకా బాగానే వుంది.. అధికార పక్షంపై చంద్రబాబు తనదైన స్టయిల్లో విమర్శలు చేయడం, అదీ రాజకీయ దాడులు – హత్యల గురించి మాట్లాడటమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబు హయాంలో, వైసీపీకి చెందిన నేతలు.. కార్యకర్తల్ని ఏ స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు ఊచ కోత కోశారో చూశాం.
సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద హత్యాయత్నం జరిగిందంటే, చంద్రబాబు పాలన ఎంత గొప్పగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. పైగా, ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పబ్లిసిటీ స్టంట్ అని అభివర్ణించడం, డీజీపీతోపాటు హోంమంత్రి దానికి వంత పాడటం.. చంద్రబాబు హయాంలో శాంతి భద్రతల పరిస్థితిని చెప్పకనే చెబుతుంది.
'రాజకీయ దాడులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు..' అని నీతి వాక్యాలు వల్లించిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించబోతున్నట్లు ప్రకటించేశారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికే ఈ పర్యటన అనీ ఆయన సెలవిచ్చారు. కార్యకర్తలకు భరోసా సంగతి తర్వాత.. ముందైతే, నేతలు జారిపోకుండా చూసుకోవాలి. సుజనా చౌదరి లాంటి నేతలే టీడీపీని వీడుతున్నారంటే, చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే. తెలంగాణలో టీడీపీకి ఇలాంటి పరిస్థితులే వచ్చాయి.. చివరికి అక్కడ టీడీపీ అడ్రస్ గల్లంతయ్యింది. ఇక ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో అదే పరిస్థితి రాబోతోందన్నమాట.
'నేతలు పోతేనేం, కార్యకర్తలు మా వెంటే వున్నారు..' అని తెలంగాణలో చెప్పుకుంటూ.. బుకాయించే ప్రయత్నం చేసి.. చేతులు కాల్చుకున్న టీడీపీ, ఇప్పుడు ఏపీలో ఓటు బ్యాంకు పేరు చెప్పి, వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే.. అంతే సంగతులు.!