తెలుగుదేశం పార్టీ పూర్వపు ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు వైసీపీ సర్కార్ మీద తాజాగా విమర్శలు సంధించారు.
ఏపీలో విద్యుత్ కోతలు ఎక్కువైపోయాయి అన్నది ఆయన ప్రధాన అభియోగం. అంతే కాదు, ఏపీలో సోలార్ టెండర్ల రద్దు వెనక సర్కార్ చేసిన అవకతవకలు ఉన్నాయని గతంలో విద్యుత్ శాఖను చూసిన కళా ఆరోపిస్తున్నారు.
మేమున్నపుడు ఇరవై నాలుగు గంటలూ కరెంట్ ఇచ్చామని కళా చెప్పుకున్నారు. ఇపుడు జగన్ సర్కార్ ఇవ్వలేకపోతోందని దెప్పి పొడుస్తూనే ఒక సత్యాన్ని ఆయన చెప్పారు.
ఏపీలో గత రెండేళ్ళూ సమృద్ధిగా వానలు కురుస్తున్నాయని కళా చెప్పడమే ఇక్కడ పాయింట్. అయితే యధా ప్రకారం ఆయన విమర్శలు కొనసాగించారు. వానాకాలంలో కూడా విద్యుత్ కోతలు పెడుతున్నది వైసీపీ సర్కార్ అంటూ నిందించారు.
ఈ రాజకీయ ఆరోపణలను పక్కన పెడితే కళా మాత్రం తమ ఏలుబడిలో అసలు వానలు లేవన్న విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారనే అనుకోవాలి.
అంతే కాదు, జగన్ అడుగు పెట్టాకనే ఏపీలో జూన్ నాటికే మంచి వర్షపాతం నమోదు అవుతోందన్న నగ్న సత్యాన్ని కూడా ఒప్పుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక విద్యుత్ కోతలు అన్నవి లేవని, అది తప్పుడు ప్రచారమని కూడా వారు ఖండిస్తున్నారు.