ఉద్యోగం వచ్చి ఒకరు.. ఉద్యోగం రాక మరికొందరు

ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఎంపిక ఫలితాలు కొన్ని కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చాయి. కానిస్టేబుల్ ఉద్యోగం రాక ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా.. ఉద్యోగం వచ్చే సమయానికి మరో వ్యక్తి చనిపోయాడు. దీంతో ఆ కుటుంబాలన్నీ…

ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఎంపిక ఫలితాలు కొన్ని కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చాయి. కానిస్టేబుల్ ఉద్యోగం రాక ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా.. ఉద్యోగం వచ్చే సమయానికి మరో వ్యక్తి చనిపోయాడు. దీంతో ఆ కుటుంబాలన్నీ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాయి.

కష్టపడి అర్హత సాధించాడు. ఉద్యోగం వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నాడు. కానీ మెరిట్ లిస్ట్ లో ఉద్యోగం రాలేదు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ లోని హన్వాడకు చెందిన రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు ఉద్యోగం రాలేదని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్, ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఇలాంటి ఘటనే థరూర్ లోనూ జరిగింది. ఉద్యోగం రాలేదని కలత చెంది దేవార్జున్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు.

దీనికి పూర్తి రివర్స్ లో జరిగిన కొత్తగూడెంలోని ఘటన. పాత తాండాకు చెందిన ప్రవీణ్ ఇటీవల వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. కానీ ఆ కుటుంబంలో మచ్చుకు కూడా ఆనందం లేదు. ఎందుకంటే, కొన్ని నెలల కిందట ఆ వ్యక్తి చనిపోయాడు.

తను గ్యారెంటీగా సెలక్ట్ అవుతానని ప్రవీణ్ కు తెలుసు. ఇంట్లో కూడా అదే చెప్పాడు. రిజల్ట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అంతలోనే ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు ప్రవీణ్. అతడు ఊహించినట్టుగానే ఫలితాల్లో అతడు ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. చేతికందొచ్చిన కొడుకు ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో, ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.