వార్తా పత్రికల ప్రింట్ ఎడిషన్ల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ నివేదికలు అక్కర్లేదు! వార్తా పత్రికలను కొని చదివే వాళ్లు బాగా తగ్గిపోయారు. మూడేళ్ల కిందటి వరకూ కూడా ఇంటికి పేపర్ వేయించుకోవడాన్ని ఎంతో కొంత ప్రిస్టేజీ అనుకున్న వాళ్లు, పగలంతా పొద్దు పోక పేపర్ ను తిరగేయడాన్ని దశాబ్దాలుగా అలవాటుగా కలిగిన వారు కూడా వార్తా పత్రికకు దూరం అయిపోయారు! దానికి అనేక కారణాలు.
కరోనా సమయంలో వార్తా పత్రికలను ఇళ్లకు వేయించుకోవడాన్ని చాలా మంది ఆపేశారు. అప్పటికే ఇంటర్నెట్ సేవలు విస్తృతం అయ్యాయి. టీవీలు చెలరేగిపోతున్నాయి. పేపర్ ఎప్పుడైతే ఇంటి వరకూ రావడం ఆగిందో.. అప్పటి వరకూ దాన్ని చదివే అలవాటున్న వారు కూడా క్రమంగా దూరం అయ్యారు. వార్తల కోసం మొబైల్ ను ఆశ్రయిస్తూ వస్తున్నారు.
ఇక కరోనా సమయంలో ప్రింట్ ఎడిషన్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. యాడ్స్ లేక కనీసం ప్రింట్ వేస్తే చాలనే పరిస్థితి నెలకొంది. పేజీలను తగ్గించి వేశాయి పెద్ద పెద్ద పత్రికలు! సినిమా పేపర్లు, స్పోర్ట్స్ పేజీలు, ఫీచర్ పేజీలను కూడా తగ్గించి వేశాయి. నాణ్యత తగ్గింది. డజన్ల కొద్దీ పేజీలను వేసే పత్రికలు పది, పన్నెండు పేజీలకు పరిమితం అయ్యాయి. అందులోనే జిల్లా ఎడిషన్లను సర్దాయి. ఆదివారం సంచికలు, స్పెషల్ పేజీల నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. ఈ పరిణామాలన్నీ నిజంగానే పేపర్ ను కొనాలనే ఆసక్తిని మరింత తగ్గించి వేశాయి!
ఏదో రాజకీయ అవసరాలతో పత్రికలను ముద్రించడమే తప్ప..మరో సార్థకత లేదన్నట్టుగా ఉంది తెలుగనాట పత్రికల పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ తెలుగు పత్రికల పరిస్థితిని చాటింది. ఈ లెక్కల ప్రకారం.. ప్రధాన పత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిల సర్క్యులేషన్ భారీగా పడిపోయింది.
ఈనాడు సర్క్యులేషన్ 16 లక్షల స్థాయి నుంచి పన్నెండుకు పడింది. సాక్షి స్థాయి పదిన్నర నుంచి తొమ్మిదిన్నరకు తగ్గింది. ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ 6.6 లక్షల స్థాయి నుంచి 3.6 లక్షల స్థాయికి తగ్గింది. ఈ నంబర్లు పెద్దగా ఆశ్చర్యపరచవు.
తెలుగు పేపర్లకు యాడ్స్ విషయంలో హైదరాబాద్ ఇప్పటికీ ప్రధాన ఆదాయవనరు. హైదరాబాద్ లో కూడా భారీగా వీటి సర్క్యులేషన్ పడిపోయింది. అయితే పతనావస్థలో కూడా సాక్షి పరిస్థితి కాస్త మెరుగు! తెలంగాణలో ఈ పత్రికకు పెద్దగా రాజకీయ ప్రయోజనాలు లేవు. ఏపీ సంగతెలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం ఎటూ వాలలేదనే అనుకోవాలి. దీంతోనే పరిస్థితి కాస్త బెటర్ గా ఉందేమో!