గుబులు రేపుతున్న బీఆర్ఎస్ బీఫామ్స్‌

బీఆర్ఎస్ అభ్య‌ర్థుల్లో బీఫామ్స్ గుబులు రేపుతున్నాయి. 119 సీట్ల‌కు గాను నాలుగైదు సీట్లు మిన‌హా ఒక‌టేసారి అభ్య‌ర్థులంద‌రినీ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఇంకా…

బీఆర్ఎస్ అభ్య‌ర్థుల్లో బీఫామ్స్ గుబులు రేపుతున్నాయి. 119 సీట్ల‌కు గాను నాలుగైదు సీట్లు మిన‌హా ఒక‌టేసారి అభ్య‌ర్థులంద‌రినీ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఇంకా క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. తాజాగా ఇవాళ ఉద‌యం కాంగ్రెస్ పార్టీ 55 మందితో కూడిన మొట్ట‌మొద‌టి జాబితాను ప్ర‌క‌టించింది.

తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీఫామ్స్ పంపిణీ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ శ్రీ‌కారం చుట్టారు. అయితే 51 మంది అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే వాటిని అంద‌జేయ‌డంతో మిగిలిన వారిలో ఆందోళ‌న నెల‌కుంది. అభ్య‌ర్థుల మార్పు ఏమైనా వుంటుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అయితే అలాంటిదేమీ ఉండ‌ద‌ని బీఆర్ఎస్ కొట్టి పారేస్తోంది.

ఆదివారం ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలకు చెందిన అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే బీఫామ్స్ అంద‌జేయ‌డం గ‌మ‌నార్హం. సీఎం కేసీఆర్ త‌ర‌పున గంప గోవ‌ర్ధ‌న్ బీఫామ్ అందుకున్నారు. బీ ఫామ్‌తో పాటు ఒక్కో అభ్య‌ర్థికి రూ.40 ల‌క్ష‌ల చెక్కును కేసీఆర్ అంద‌జేయ‌డం గ‌మ‌నార్హం. ఇవాళ బీఫామ్స్ అంద‌ని అభ్య‌ర్థులు సోమ‌వారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వ‌చ్చి స్వీక‌రించాల‌ని సీఎం కేసీఆర్ కోరారు.

బీఫామ్స్‌పై సంత‌కాలు చేసే స‌మ‌యం లేక‌పోవ‌డం వ‌ల్లే కొంద‌రికి మాత్ర‌మే అంద‌జేస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. అభ్య‌ర్థుల ఆందోళ‌న‌ను దృష్టిలో పెట్టుకుని, రెండో ఆలోచ‌న పెట్టుకోవ‌ద్ద‌ని, ఎలాంటి భ‌యాందోళ‌న‌లు మ‌న‌సులోకి రానివ్వొద్ద‌ని ఆయ‌న సూచించారు. అయితే ఎల్లో మీడియా మాత్రం ఫ‌లానా అభ్య‌ర్థుల‌ను మారుస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అభ్య‌ర్థుల మ‌న‌సులో చెల‌రేగుతున్న ఆందోళ‌న‌కు ఇలాంటి ప్ర‌చారం  ఆజ్యం పోస్తున్న‌ట్టైంది.