బెదిరించి టికెట్ ద‌క్కించుకున్న బాబుమోహ‌న్‌!

బీజేపీ అధిష్టానాన్ని బెదిరించి మ‌రీ టికెట్ ద‌క్కించుకున్న ఘ‌న‌త క‌మెడియ‌న్‌, బీజేపీ సీనియ‌ర్ నేత బాబు మోహ‌న్‌కే ద‌క్కింది. బీజేపీ మూడో జాబితాలో ఆయ‌న‌కు చోటు ద‌క్క‌డం విశేషం. ఇవాళ బీజేపీ 35 మంది…

బీజేపీ అధిష్టానాన్ని బెదిరించి మ‌రీ టికెట్ ద‌క్కించుకున్న ఘ‌న‌త క‌మెడియ‌న్‌, బీజేపీ సీనియ‌ర్ నేత బాబు మోహ‌న్‌కే ద‌క్కింది. బీజేపీ మూడో జాబితాలో ఆయ‌న‌కు చోటు ద‌క్క‌డం విశేషం. ఇవాళ బీజేపీ 35 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన మూడో జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో బాబు మోహ‌న్ పేరు ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఆందోల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బాబుమోహ‌న్ టికెట్ ఆశిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బాబుమోహ‌న్ మూడో ప్లేస్‌కు ప‌డిపోవ‌డంతో టికెట్ ద‌క్క‌ద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగింది. బాబు మోహ‌న్ కుమారుడికి టికెట్ ఇస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారంపై బాబుమోహ‌న్ తీవ్ర ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించారు. గ‌త నెల 28న ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని నిర‌సిస్తూ సీరియ‌స్ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అంత‌టితో ఆయ‌న ఆగ‌లేదు. బీజేపీకి రాజీనామా చేస్తాన‌ని కూడా చెప్పారు. అలాగే బీజేపీ ప్ర‌స్తుత‌, పాత అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌లు తాను ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న కుమారుడికి టికెట్ ఇచ్చే ఉద్దేశం వుంటే చెప్పాల‌ని, అంతేగానీ, తండ్రీత‌న‌యుల మ‌ధ్య గొడ‌వ పెట్టొద్ద‌ని హిత‌వు ప‌లికారు.

త‌న‌కంటూ ఇమేజ్ వుంద‌ని, టికెట్ ఇవ్వ‌డానికి ఒక‌టి, రెండు జాబితాలంటూ కాల‌యాప‌న చేయ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. దీంతో ఆయ‌న‌పై బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య తీసుకుంటుంద‌ని అంతా అనుకున్నారు. అలాంటివేవీ జ‌ర‌గ‌క‌పోగా, అనూహ్యంగా ఆందోల్ టికెట్‌ను ఆయ‌న‌కే ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. బాబుమోహ‌న్ బీజేపీ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి టికెట్ సాధించుకున్నార‌ని ఆ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.