తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు… టీఆర్ఎస్ వర్గాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి టీఆర్ఎస్ కూడా కారణమని చంద్రబాబు భావిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తన ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్‌కు టీఆర్ఎస్, బీజేపీ అన్ని రకాలుగా సహకరించడం వల్లే ఎన్నడూ లేని విధంగా ఓటమి రుచి చూడాల్సి వచ్చిందని చంద్రబాబు రగిలిపోతున్నారు.
2018లో తనను ఓడించడానికి కాంగ్రెస్‌తో జత కట్టిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అప్పట్లో కేసీఆర్ హెచ్చరించడం రాజకీయంగా పెద్ద చర్చే జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి జగన్‌కు అనేక రకాలుగా కేసీఆర్ సాయం అందించారనే ప్రచారం జరిగింది.
అప్పటి నుంచి కేసీఆర్‌పై చంద్రబాబు లోలోపల రగిలిపోతున్నారు. కేసీఆర్‌ను పడగొట్టడానికి చాపకింద నీరులా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన ఆరోపణ చేయడంతో ఒక్కసారిగా పాత కక్షలన్నీ తెరపైకి వస్తున్నాయి. ఒక ప్రముఖ చానల్‌తో గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను సమైక్యవాదులు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
ఏడాదిగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలున్నాయని ఆయన విమర్శించారు. కేవలం చంద్రబాబును దృష్టిలో పెట్టుకునే గుత్తా ఆరోపణలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. తన వాళ్లను ఓ పథకం ప్రకారం బీజేపీలోకి చంద్రబాబు పంపారని, వారి ద్వారానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.
కేసీఆర్‌ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శల నేపథ్యంలో చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కేసీఆర్‌పై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి సాయపడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవడం లేదు. తెలంగాణలో కేసీఆర్‌ను దెబ్బతీసేందుకు బాబును బీజేపీ వాడుకుంటోందా? అనే చర్చకు గుత్తా తాజా విమర్శలు కారణమయ్యాయి.