బీసీల భారీ డిమాండ్: కాంగ్రెస్‌లో చెల్లేనా?

తెలంగాణలో ఉన్నదే 119 నియోజకవర్గాలు. అందులో 18 ఎస్సీలకు, 9 ఎస్టీలకు రిజర్వు అయిన స్థానాలు పోగా 92 మిగులుతాయి. అగ్రవర్ణాలు, బీసీలు ఇలా ఏ పేరు చెప్పుకున్నా సరే వారందరూ కలిసి ఈ…

తెలంగాణలో ఉన్నదే 119 నియోజకవర్గాలు. అందులో 18 ఎస్సీలకు, 9 ఎస్టీలకు రిజర్వు అయిన స్థానాలు పోగా 92 మిగులుతాయి. అగ్రవర్ణాలు, బీసీలు ఇలా ఏ పేరు చెప్పుకున్నా సరే వారందరూ కలిసి ఈ 92 స్థానాల్లోనే పోటీచేయాలి. అందులో  48 సీట్లు అంటే.. ఏకంగా 52 శాతం! మరి 52 శాతం సీట్లను బీసీలకు కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుందా? అనేది పెద్ద చర్చ!

అయితే ఆ పార్టీలోని బీసీలు మాత్రం తమకు పెద్ద సంఖ్యలో సీట్ల కేటాయింపు జరగాలని పట్టుపడుతున్నారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మూడేసి వంతున 51 సీట్లు బీసీలకు కావాలని అంటున్న వారు.. అందులో 48 సీట్లలో గెలుపు అవకాశాలు ఉన్నాయి గనుక.. తప్పకుండా ఇచ్చి తీరాల్సిందే అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెసులో రెడ్డి వర్గానికి చెందిన నాయకుల ప్రాబల్యమే ఎక్కువ. నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే.. పార్టీని నిలబెడుతున్న నాయకులు కూడా ఆ వర్గానికి చెందిన వారే. పదవులు కావాల్సి వచ్చినప్పుడు, ఎన్నికల వేళ టికెట్లు కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే.. ఆ పార్టీకి చెందిన వాళ్లు కులాల పమతూకం గురించి మాట్లాడుతుంటారు. తతిమ్మా సందర్భాల్లో మౌనంగా ఉంటారు. ఆ విషయాలన్నీ పక్కన పెట్టినప్పటికీ.. బీసీలకు వారు కోరుతున్నట్టుగా 52 శాతం కేటాయించి 48 సీట్లు ఇవ్వడం సాధ్యమేనా? అది పార్టీకి నష్టదాయకంగా పరిణమించకుండా ఉంటుందా? అనే చర్చలు ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్నాయి. 

అయితే బీసీలకు తమ పార్టీ పెద్ద పీట వేస్తోందనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వారు సిద్ధంగానే ఉన్నారు. ప్రతి ఎంపీ నియోజకవర్గానికి రెండేసి సీట్ల వంతున.. 34 సీట్లు బీసీలకు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇది చాలదు.. 48 వరకు కావాలని.. బీసీ నాయకుల డిమాండ్. ఆ మాటకొస్తే.. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన భారాస కేవలం 23 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చింది. తాము 34 మందికి ఇచ్చినా ఆ తేడా చాలా ఎక్కువని.. బీసీలను ఆదరించే పార్టీ కాంగ్రెసు మాత్రమే అని చాటుకోవడానికి ఆ నెంబర్ సరిపోతుందని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

అదే సమయంలో కొందరు బీసీ నాయకుల మాటలు కూడా గమనించదగ్గవి. బీసీలకు టికెట్లు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని కోరుకోవడం నిజమే గానీ.. అంతకంటె ముఖ్యగా.. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయడం అవసరం అని వారు అంటున్నారు. బీసీల్లో ప్రజాబలం, ధనబలం ఉన్న నాయకులు పుష్కలంగా ఉంటే.. 48 ఏం ఖర్మ.. 70 శాతం సీట్లయినా ఇస్తారు కదా.. గెలిచేవారిని వదులుకోవాలని ఏ పార్టీ అయినా అనుకుంటుందా.. అని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.