బీజేపీకి బిగ్ షాక్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట ఆ రాష్ట్ర బీజేపీకి మ‌రో బిగ్ షాక్‌. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మ్యానిఫెస్టో క‌మిటీ చైర్మ‌న్ వివేక్ వెంక‌ట‌స్వామి, ఆయ‌న త‌న‌యుడు వంశీ ఆ పార్టీకి రాజీనామా చేశారు.…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట ఆ రాష్ట్ర బీజేపీకి మ‌రో బిగ్ షాక్‌. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మ్యానిఫెస్టో క‌మిటీ చైర్మ‌న్ వివేక్ వెంక‌ట‌స్వామి, ఆయ‌న త‌న‌యుడు వంశీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలంగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, వివేక్ వెంట‌క స్వామి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే రాజ‌గోపాల్‌రెడ్డి మాత్రం వెంట‌నే రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు.

కానీ బీజేపీకి రాజీనామా, కాంగ్రెస్‌లో చేరిక వార్త‌ల్ని ఇటీవ‌ల వివేక్ ఖండించ‌డం గ‌మ‌నార్హం. పెద్ద‌ప‌ల్లి లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. దీంతో వివేకా కాంగ్రెస్‌లో చేర‌ర‌ని అంతా అనుకున్నారు. ఈ లోపు ఆయ‌న టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ కావ‌డంతో మ‌రోసారి పార్టీ మార్పు వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ఇవాళ్టితో బీజేపీతో అనుబంధాన్ని ఆయ‌న తెంచుకున్నారు.

వివేక్‌తో పాటు ఆయ‌న కుమారుడు వంశీ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. మ‌ల్లిఖార్జున‌ఖ‌ర్గేతో ఫోన్‌లో వివేక్ మాట్లాడిన‌ట్టు స‌మాచారం. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం తెలంగాణ‌కు వ‌స్తున్న కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్‌గాంధీతో వివేక్‌, ఆయ‌న కుమారుడు బుధ‌వారం భేటీ కానున్నారు. రాహుల్ స‌మక్షంలో ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌వ‌నాలు వీస్తుండ‌డం, బీజేపీకి రోజురోజుకూ ఆద‌ర‌ణ త‌గ్గిపోతుండ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు ఒక్కొక్క‌రుగా పార్టీ వీడుతున్నారు. 

వివేక్ వెంక‌ట‌స్వామి కుటుంబం మొద‌టి నుంచి కాంగ్రెస్‌లో వుంది. వివేక్ తండ్రి వెంక‌ట‌స్వామి కాంగ్రెస్‌లో కీల‌క స్థానాల్లో ప‌ని చేశారు. వివేక్ కూడా కాంగ్రెస్‌లో ఎంపీగా ప‌ని చేశారు. తిరిగి ఆయ‌న మాతృ పార్టీలోకి చేరుతుండ‌డం విశేషం.