గులాబీ మేనిఫెస్టో: అచ్చంగా వేలం పాటే!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం భారాస మేనిఫెస్టోను ప్రకటించారు. సహజంగానే ఇందులో జనాకర్షక పథకాలకు పెద్దపీట వేశారు. మేనిఫెస్టో ప్రధానాంశాలకు ప్రాతిపదిక కేవలం జనాకర్షణ మాత్రమే కాదు. కాంగ్రెస్,…

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం భారాస మేనిఫెస్టోను ప్రకటించారు. సహజంగానే ఇందులో జనాకర్షక పథకాలకు పెద్దపీట వేశారు. మేనిఫెస్టో ప్రధానాంశాలకు ప్రాతిపదిక కేవలం జనాకర్షణ మాత్రమే కాదు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇచ్చే హామీలకు ఇంకాస్త పెంచి ప్రకటించడం కూడా జరిగింది. బీఆర్ఎస్ మేనిఫెస్టో ను గమనిస్తే.. అచ్చంగా వేలంపాట లాగానే అనిపిస్తోంది.

ప్రధానంగా పెన్షన్ల సంగతి చెప్పుకోవాలి. వృద్ధులకు ఇచ్చే ఆసరా పెన్షన్లను 5016కు పెంచుతున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. ఇది కేవలం కాంగ్రెస్ మీద పైచేయి సాధించడం కోసం మాత్రమే చెప్పిన హామీ!

అభ్యర్థుల జాబితా ప్రకటించిన నాడే.. ‘కర్ణాటక లో ఇవ్వలేని వాళ్లు ఇక్కడ ఇస్తామంటున్నారు.. ఇవ్వడం మాకు చేతకాదా.. మాకు తెల్వదా’ అని కేసీఆర్ మాట్లాడారు. ఆ మాటలకు తగ్గట్టుగానే.. కాంగ్రెస్ 4వేలు చేస్తామని అంటే, ఆయన తాము 5016 చేస్తామని చెప్పారు. ప్రస్తుతం మూడువేలు ఉండగా.. ఈసారి అధికారంలోకి రాగానే మొదటి ఏడాది నాలుగువేలు చేస్తారట. ఆ తర్వాత ఏటా 500 పెంచుతూ పదవీకాలం ముగిసేలోగా 5016 చేస్తారట.

వికలాంగపెన్షన్ల పరిస్థితి కూడా అంతే. ప్రస్తుతం వారికి 4016 అందుతోంది. దానికి 6000 చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇదే తరహాలో తొలిఏడాది వెయ్యి పెంచి, తర్వాత క్రమంగా పెంచుతారు.

ఈ పింఛను నిర్ణయాలు కాంగ్రెస్ మీద పైచేయికోసం కాగా, బిజెపి మీద పైచేయి కోసం గ్యాస్ సిలిండర్ ధరను కేసీఆర్ ఆశ్రయించారు. కేంద్రప్రభుత్వం ప్రతి సిలిండర్ మీద 300 రూపాయలు తగ్గించి, ఒక జనాకర్షక అస్త్రం దేశం మీద ప్రయోగించింది. దానికి కేసీఆర్ తన ముద్రను జోడించారు. అర్హులైన పేదలందరికీ రూ.400కే గ్యాస్ సిలిండర్ అందేలా చేస్తామని ఆయన వెల్లడించారు.

ఆరోగ్యశ్రీని 15లక్షల పరిమితికి పెంచడం, తెల్లరేషన్ కార్డు కలిగిఉన్న ప్రతి ఇంటికి ఎల్ఐసీ ద్వారా 5 లక్షల జీవితబీమా చేయించడం వంటివి కూడా అనేకం మేనిఫెస్టోలో ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ బిజెపి పథకాల మొత్తాలకు వేలంపాటలాగా పెంచుకుంటూ పోయి.. ఆదరణ సృష్టించుకోడానికి కేసీఆర్ వ్యూహరచన చేసినట్టుగా కనిపిస్తోంది.