రేవంత్.. బుల్లెట్ దిగిందా? లేదా? చూడు అంతే!

తెలంగాణ కాంగ్రెసు పార్టీకి సారథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు చాలా కష్టం వచ్చింది. కేసీఆర్ ప్రకటించిన హామీలు అన్నీ డొల్ల అని, తమ హామీలు మాత్రమే నికార్సయినవి అనీ ప్రజలను నమ్మించాల్సిన బాధ్యత…

తెలంగాణ కాంగ్రెసు పార్టీకి సారథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు చాలా కష్టం వచ్చింది. కేసీఆర్ ప్రకటించిన హామీలు అన్నీ డొల్ల అని, తమ హామీలు మాత్రమే నికార్సయినవి అనీ ప్రజలను నమ్మించాల్సిన బాధ్యత ఆయన మీద పడింది. భారాస మేనిఫెస్టో గురించి.. వేరే ఏమీ అనలేక.. కాంగ్రెస్ హామీలనే కేసీఆర్ కాపీ కొట్టారని అంటున్నారు. 

కేసీఆర్ సమయం మొత్తం ఇతర పార్టీల హామీలను కాపీ కొట్టేందుకే సరిపోతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను కేసీఆర్ ఒక్కో వెయ్యి పెంచుతూ ప్రకటించడాన్ని ఆయన ఎత్తిచూపారు. పరాన్నజీవిగా కేసీఆర్ మారిపోయారని నిందించారు.

నిజమే కావొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కాంగ్రెసు పార్టీ వారు ఎన్నికలకు చాలా కాలం ముందుగానే ప్రకటించిన వరాలను అందిపుచ్చుకుని.. వాటికి కొంత అదనంగా జోడించి.. తన మేనిఫెస్టోగా ప్రకటించి ఉండవచ్చు. అయితే ఏమిటి?

సాధారణంగా ప్రజల దృష్టి ఎలా ఉంటుంది? ఓటరు  అనే వాడు, ఏ ప్రభుత్వం తనకు ఎక్కువ మంచి చేస్తానంటోంది అనే పాయింట్ మాత్రమే గమనిస్తాడు. ఆ పనిచేసేలాగా ఆ పార్టీకి ఐడియా ఇచ్చింది ఎవరో వారి గురించి పట్టించుకోడు. ఎవరిని కాపీ కొట్టి ఆ వరం ప్రకటించారో.. ఆ మూల పురుషులను నెత్తిన పెట్టుకోడు. అంతిమంగా వృద్ధుల విషయానికి వచ్చేసరికి.. కాంగ్రెసు నాలుగువేలు ప్రకటిస్తే, భారాస అయిదువేలు అని అన్నది. ఓటరు ఆలోచన అనేది.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ అనే గమనిస్తుంది తప్ప.. ఎవరు ముందు చెప్పారు అనేది గమనిస్తుందా?

ఏదో సినిమాలో చెప్పినట్టుగా.. ఎవరు ముందు వచ్చారన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా? అనేదే రాజకీయాల్లో కూడా ముఖ్యం. కాబట్టి, కేసీఆర్ తమ వాగ్దానాలను కాపీ కొట్టాడు గనుక.. అయిదు వేలు ఇస్తున్న ఆయనకు కాకుండా, తమకే ఓటు వేయాలని రేవంత్ ప్రజలను అడగగలరా? అసాద్యం.

అయితే, రేవంత్ కు ఒక ఎడ్వాంటేజీ ఇంకా మిగిలే ఉంది. కాంగ్రెస్ కేవలం కొన్నింటి ప్రకటన మాత్రమే చేసింది. వారి మేనిఫెస్టో ఇంకారాలేదు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మెరుగులు దిద్దుకుంటూ ఉంది. కాబట్టి.. పెన్షన్ల విషయంలో తామే వెనకబడ్డ సంగతిని మర్చిపోయి.. తమ ప్రకటనలతో సంబంధం లేకుండా కేసీఆర్ ప్రకటించిన ఇతర విషయాలుంటే.. వాటిని మించి తాము చేస్తామని మేనిఫెస్టోలో చెప్పగలగాలి. ప్రజలను నమ్మించగలగాలి. అప్పుడు కొంత ప్రయోజనం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.