ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మైండ్‌గేమ్ మొదలు పెట్టింది. కాసేపటి క్రితం టీఆర్ఎస్ …బీఆర్ఎస్‌గా మారింది. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ అవతరించడానికి ముందే మంత్రి ఎర్రబల్లి దయాకర్ తదితర నేతలు ఏపీ రాజకీయాలపై మాట్లాడ్డం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. బీఆర్ఎస్‌పై తీర్మానానికి కొన్ని గంటల ముందు మంత్రి దయాకర్ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.
మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఏపీలో తమ జాతీయ పార్టీ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ చర్చించినట్టు ఆయన తెలిపారు. ఏపీలో తమ పార్టీకి మంచి భవిష్యత్ వుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే సందర్భంలో జనవరిలో గుంటూరు లేదా విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా మంత్రి దయాకర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రాంతీయ పార్టీలు బీజేపీతో సన్నిహితంగా ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ అవతరించింది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, ప్రజలు తమకు అండగా ఉంటాయని కేసీఆర్ నూతన పార్టీ నేతలు కలలు నమ్ముతున్నారు.
ఏపీలో విభజన హామీలు నెరవేర్చకపోవడం, విశాఖ స్టీల్‌ను అమ్మకానికి పెట్టడం, జాతీయ ప్రాజెక్ట్ పోలవరానికి నిధుల విడుదలలో జాప్యం, అలాగే ప్రత్యేక హోదా, ఉక్కు పరిశ్రమ నిర్మాణం, ఉత్తరాంధ్రకు రైల్వేజోన్ ఇవ్వకుండా కించపరిచేలా రోజుకో మాట చెప్పడం, అలాగే మూడు రాజధానుల వ్యవహారం తదితర సమస్యలపై బీఆర్ఎస్ గళం విప్పే అవకాశం ఉంది.
ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నా, ప్రశ్నించలేని పార్టీలను బీఆర్ఎస్ విమర్శిస్తూ, తమకు అండగా నిలిస్తే పోరాడి సాధిస్తామని నమ్మబలికే అవకాశం ఉంది. తెలంగాణ సాధననే ఉదాహరణగా చూపే అవకాశం ఉంది. మొత్తానికి ఏపీతో మాత్రం కేసీఆర్ పార్టీ మైండ్‌గేమ్ ఆడేందుకు సిద్ధమైనట్టు ఆ పార్టీ నేతల మాటలు చెబుతున్నాయి.