భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నుంచి ఘాటైన పంచ్ పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడంలో రేవంత్‌రెడ్డి మొదటి వరుసలో వుంటారు. బీఆర్ఎస్‌ను ప్రకటించడమే ఆలస్యం, రేవంత్ తన మార్క్ విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణను అడ్డు పెట్టుకుని కేసీఆర్ స్వప్రయోజనాల్ని నెరవేర్చుకున్నారని విమర్శించారు.
2001లో టీఆర్ఎస్‌ను స్థాపించిన కేసీఆర్, ఆ తర్వాత ఇప్పటి వరకూ సాగిన రాజకీయ ప్రస్థానంలో ఆర్థికంగా బలోపేతం అయ్యారని విమర్శించారు. తెలంగాణను అడ్డుపెట్టుకుని ఇదంతా చేశారని మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ అస్తిత్వాన్ని చంపేశారని కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఇక తెలంగాణలో తన ప్రయాణం ముగిసిందని కేసీఆర్ గ్రహించారని ఆయన చెప్పుకొచ్చారు.
తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని కేసీఆర్ గ్రహించారన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయిందని సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని ధ్వజ మెత్తారు. తెలంగాణ అనే పదం ఇక్కడ ప్రజల జీవన విధానంలో భాగమన్నారు. తెలంగాణ అంటే సంస్కృతి, సంప్రదాయంగా ఆయన అభివర్ణించారు. అట్లాంటి తెలంగాణను దసరా పండుగ రోజు కేసీఆర్ హత్యకు పాల్పడ్డాడని ఘాటు విమర్శ చేశారు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ అవతరించిందని విమర్శించారు.
తెలంగాణ పదాన్ని చంపేయాలనుకుంటున్న హంతకుడు కేసీఆర్ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇట్లాంటి హంతకుని తెలంగాణ పొలిమేరలు దాటేలా తరిమి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. పోయేకాలం రావడం వల్లే తెలంగాణను కనుమరుగు చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ హంతకుడిని వదిలిపెట్టే ప్రశ్నే లేదన్నారు. తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నా.
ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. తెలంగాణలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్‌కు అర్హత లేదన్నారు. ప్రజల్ని మభ్య పెట్టడానికే బీఆర్ఎస్ పెట్టారన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని రేవంత్‌రెడ్డి వెటకారం చేశారు.