మొన్నటిదాకా తెలంగాణ ఎన్నికల ప్రచారం చాలా ముమ్మరంగా సాగింది. కనిపించిన ప్రతివాడికీ చేతిలో అయిదొందలు పెట్టి, బుజాన పార్టీ కండువా కప్పి.. తమ వెంట తిప్పుకుని.. చివర్లో బిర్యానీ పాకెట్లు చేతికిచ్చి ప్రచారాన్ని నడిపించారు. బుధవారం ఖాళీ. తుది వ్యూహాల్లో నిమగ్నం అయ్యారు. కనిపించిన ప్రతివాడినీ మనవాడే అని నమ్మే సీజను అయిపోయింది.
బుధవారం పగలూ రాత్రీ కూడా ఓటర్లకు డబ్బులు పంచే సీజను కావడంతో.. నమ్మకస్తులను వెతుక్కోవడం ప్రారంభించారు నాయకులు. అనుచరులను నమ్మలేరు. అనుచరుడి చేతికి డబ్బులిస్తే.. నామమాత్రంగా పంచి మొత్తం తామే దాచేసుకుంటారని అనుమానం. పూర్తిగా సొంత మనుషులనే డబ్బు పంపకానికి రంగంలోకి దించుతున్నారు. వారు అరెస్టు అవుతున్నారు.
హైదరాబాదులో ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేల కొడుకులు స్వయంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికిపోయారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ కొడుకు జయసింహ, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కొడుకు మణికంఠ ఇద్దరూ కూడా.. ఓటర్లను ప్రలోభ పెడుతూ డబ్బు పంచుతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు.
నాయకులు డబ్బు పంచడం అనేది ఇక్కడ ప్రధానాంశం కానే కాదు. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఏ ఒక్కచోట అయినా ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు పంచకుండా ఉన్నారని అనుకోవడం కూడా భ్రమ. అలాంటి పరిస్థితుల్లో ప్రతిచోటా పంపకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మాత్రమే దొరికిపోయారు? అదికూడా అభ్యర్థుల పుత్రులే ఎందుకు దొరికారు. అనేది చర్చనీయాంశం.
నాయకులకు అనుచరుల మీద నమ్మకం లేదు. విశ్వాసం లేదు. భారాస పాలనలో ఎమ్మెల్యేలకు- క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు కార్యకర్తలకు మధ్య చాలా చాలా గ్యాప్ వచ్చేసిందన్నది నిజం. మునిసిపాలిటీ లెవెల్ నాయకుడికి కూడా ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకక, అసంతృప్తితో రగిలిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఎన్నికలంటూ వచ్చిన తర్వాత.. అందరు నాయకులతోనూ ఎమ్మెల్యే అభ్యర్థికి పని పడుతుంది.
ఏదో చిన్న చిన్న ప్రలోభాలతో ప్రచార పర్వంలో వాడుకోగలరు గానీ.. డబ్బు పంచే సమయం వచ్చిన తర్వాత.. వారిని నమ్మాలంటే భయం. ఇన్నాళ్లూ వారిని దూరం పెట్టాం కదా.. వారి చేతికి డబ్బులిస్తే ఇక అంతే సంగతులు అని భయం. అంటే.. డబ్బు పంచడానికి కనీసం పట్టుమని పదిమంది నమ్మదగిన వ్యక్తులు కూడా లేని దుస్థితిలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారన్నమాట. అలాంటి వారు లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పదవులు కోరుకుంటున్నారు. నమ్మకమైన అనుచరులకు గతిలేక.. కన్న కొడుకులనే డబ్బు పంచే పనికి నియోగించడం వల్లనే .. వాళ్లు అరెస్టు అయ్యారని ప్రజలు అనుకుంటున్నారు.
నిజానికి డబ్బు పంపిణీ వ్యవహారాలు చాలా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తుంటాయి. కానీ ఎమ్మెల్యేల కొడుకులే దొరికిపోయారంటే బహుశా.. ఆ పంపకాల గురించి తెలిసిన పార్టీ వారే, అసంతృప్త అనుచరులే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటారని కూడా ప్రజలు భావిస్తున్నారు.