తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణమే జాతీయ వార్తా చానళ్లకు, మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కోసం ఉగ్గబట్టుకున్న వాళ్లకు ఊరట లభించనుంది. నవంబర్ 30వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే.. పోలింగ్ క్యూల్లో నిలబడిన ఓటర్ల పని పూర్తి కాగానే.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. వాటితో పాటు తెలంగాణ పోలింగ్ పై ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ లో తెలంగాణది ఆఖరి విడత. తెలంగాణ పోల్ తోనే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ ఘట్టం పూర్తి కాబోతోంది. నవంబర్ ఏడో తేదీ నుంచినే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విడతల వారీగా పోలింగ్ మొదలైంది. అది నవంబర్ 30తో ముగుస్తోంది. దీంతో నవంబర్ ఏడో తేదీన జరిగిన పోలింగ్ తో సహా.. అన్ని విడతలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ పోలింగ్ ముగిసిన వెంటనే వెల్లడి కాబోతున్నాయి.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు అటు కాంగ్రెస్ కు, ఇటు బీజేపీకి ముఖ్యమే. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే మాట ఈ మధ్య ఎత్తడం లేదు కానీ, కాంగ్రెస్ ఓడించాలనే కసి అయితే బీజేపీకి గట్టిగా ఉంది.
మరి అలాంటి బీజేపీని ఎదుర్కొని నిలవాలంటే కాంగ్రెస్ కు ఈ ఫలితాలు కీలకమే. మరి వాటి సరళి ఎలా ఉంటుందో.. ఎగ్జిట్ పోల్స్ కాస్త రుచి చూపించనున్నాయి. అయితే.. అసలు ఫలితాలకు మాత్రం మరి కాస్త సమయం ఉంది. డిసెంబర్ మూడున ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.అంతవరకూ ఎగ్జిట్ పోల్స్ దే రాజ్యం!