ఒకవైపు ద్రావిడ్ నే కోచ్ గా కొనసాగించడానికి బీసీసీఐ నిర్ణయించుకుంది. వరల్డ్ కప్ తో ద్రావిడ్ టీమిండియా కోచ్ బాధ్యతల టర్మ్ పూర్తై తప్పుకుంటున్నాడనే వార్తలు వచ్చినా, కాంట్రాక్టును కొనసాగిస్తోంది బీసీసీఐ. దీనికి ద్రావిడ్ కూడా సుముఖత వ్యక్తం చేశాడట. దీంతో కోచ్ గా ద్రావిడ్ కొనసాగడం లాంఛనమే!
ఇక కెప్టెన్సీ విషయంలో కూడా ఇప్పుడు బీసీసీఐ కొంత ఇరకాటంలో పడింది. ఏరికోరి టీ20 కెప్టెన్ గా చేసుకున్న హార్దిక్ పాండ్యా గాయంతో ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో సౌతాఫ్రికాతో టీ20 సీరిస్ కు టీమిండియా కెప్టెన్ గా మళ్లీ రోహిత్ శర్మకే బాధ్యతలు దక్కనున్నాయనే మాట వినిపిస్తోంది.
ఇన్నాళ్లూ అనధికారికంగా రోహిత్ ను టీ20ల విషయంలో పక్కన పెట్టింది బీసీసీఐ. రోహిత్, విరాట్ లకు టీ20ల విషయంలో బలవంతపు విశ్రాంతినే ఇచ్చింది. హార్దిక్ ను కెప్టెన్ గా ప్రమోట్ చేయడానికి తంటాలు పడింది. అయితే హార్ధిక్ కు భారత క్రికెట్ అభిమానుల నుంచినే పెద్దగా మద్దతు లేదు. దానికి తోడు అతడు ఎప్పుడు ఫిట్ గా ఉంటాడో ఎవరూ చెప్పలేరు! చాన్నాళ్ల పాటు టీ20ల్లో కూడా తన పూర్తి కోటాను పూర్తి చేయలేదు. ఇక వన్డేల్లో అయితే కనీసం బౌలింగ్ కు కూడా దిగలేదు కొన్నాళ్ల పాటు! అయితే అతడ్ని కపిల్ దేవ్ అంటూ రుద్దుతూ వచ్చారు.
వరల్డ్ కప్ లో గాయంతో అర్ధాంతరంగా హార్ధిక్ వైదొలిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సీరిస్ కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే రోహిత్ కు తిరిగి పగ్గాలప్పగించాలని బీసీసీఐ భావిస్తోందట. మరి అదే జరిగితే.. వచ్చే టీ20 ప్రపంచకప్ కు కూడా రోహిత్ కే అవకాశం ఉండవచ్చు! వచ్చే టీ20 ప్రపంచకప్ లో రోహిత్, కొహ్లీలు జట్టులో ఉంటే మంచిదనే అభిప్రాయాలు మాజీల నుంచి వినిపిస్తున్నాయి.