తెలంగాణ ప్రజానీకం అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తమ తీర్పును ఇవ్వడానికి సిద్ధమైన వేళ విజేతగా ఎవరు నిలవబోతున్నారనేది ఆసక్తిదాయకమైన అంశం. ఆవిర్భావం తర్వాత మూడోసారి ఎన్నికలను జరుపుకుంటున్న తెలంగాణ మూడోసారీ కేసీఆర్ కే అవకాశం ఇస్తుందా లేక మార్పును కోరకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఫలితాల విషయంలో ఎవరి ఆశలు వారికి ఉన్నాయి. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.
అయితే ఆవిర్భావం దగ్గర నుంచి చూస్తే.. తెలంగాణలో పార్టీల స్థితిగతులైతే చాలా మారాయి. 2014లో తొలిసారి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు ఓట్లను పంచుకున్నే తీరుకు, ప్రస్తుత పరిస్థితికి పొంతన లేదు!
తెలంగాణ అసెంబ్లీ మొదటి ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని సంపాదించుకున్నా.. అప్పుడు టీఆర్ఎస్ కు దక్కింది. 34 శాతం ఓట్లే! ఆ నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు 25 శాతం ఓట్లను పొందింది. తెలుగుదేశం పార్టీ 14 శాతం ఓట్లను పొందింది! కాంగ్రెస్, టీడీపీ ఓట్ల శాతం కలిపితే అది టీఆర్ఎస్ కన్నా చాలా చాలా ఎక్కువే! కేవలం పదేళ్ల కిందట అలా 14 శాతం ఓట్లను పొందిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో తన ఉనికిని కూడా కోల్పోయింది. ఎన్నికల బరిలో నిలవలేకపోయింది. వేరే పార్టీల ర్యాలీల్లో తెలుగుదేశం జెండా కనిపించినా అది తన స్థాయిని మరింత దిగజార్చుకోవడమే తప్ప విజయం కాదు.
గమనిస్తే.. 2014 తర్వాత ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వల్ప స్థాయిలో ఓట్లను పెంచుకుంటోంది. కానీ అధికారానికి అడ్రస్ కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంది ఇన్నాళ్లూ. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 28 శాతం ఓట్లు వచ్చాయి. అదే 2019 లోక్ సభ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ కు దాదాపు 30 శాతం ఓట్లు వచ్చాయి.
ఇక టీఆర్ఎస్ 2014తో పోలిస్తే తన ఓట్ల శాతాన్ని బాగా పెంచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 47 శాతం ఓట్లను పొందింది. కానీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం 41 శాతం ఓట్లనే పొందింది. లోక్ సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడమే టీఆర్ఎస్ కు ఇప్పటి వరకూ తెలంగాణలో తగిలిన గట్టి ఎదురుదెబ్బ. మరి ఇప్పుడు టీఆర్ఎస్ కు సిసలైన పరీక్ష ఎదురవుతోంది.
ఇక 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో బీజేపీ పరిస్థితి అణువంత అయినా మారలేదు. ఆ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ఏడు శాతం ఓట్లను పొందింది. అయితే గత లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీకి ఏకంగా 20 శాతం ఓట్లు పడ్డాయి! మరి ఆ ఫీట్ ను అయినా బీజేపీ రిపీట్ చేయగలదా అంటే.. ప్రశ్నార్థకమే అనే పరిస్థితి ఉందిప్పుడు! మజ్లిస్ 2014లో 3.7 శాతం ఓట్లను పొందితే, గత ఎన్నికలప్పటికీ 2.7 శాతానికి పడిపోయింది. సీట్లనైతే కోల్పోకపోయినా మజ్లిస్ ఉన్న నాలుగు శాతం లోపు ఓట్లలో ఒక శాతాన్ని కోల్పోయిందంటే అది పతనమే!
మరి పాత శాతాలను 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా మారుస్తారో!