సభ్యసమాజం తలదించుకునే ఘాతుకం బిహార్ లో జరిగింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులపై ఓ నీచుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారుల వయసు కేవలం మూడేళ్లు మాత్రమే.
ఎప్పట్లానే చిన్నారులు ఉత్సాహంగా బడికి బయల్దేరారు. స్కూల్ బస్ ఎక్కి పాఠశాలకు వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చే సమయంలో మానవ మృగం వాళ్లపై దాడి చేస్తుందని ఆ చిన్నారులకేం తెలుసు.
స్కూల్ వ్యాన్ లో ఒక్కొక్కర్ని ఇంటి దగ్గర దించుతూ వస్తున్నాడు డ్రైవర్ సికిందర్ రాయ్. చివరికి బస్సులో ఇద్దరు చిన్నారులు మాత్రమే మిగిలారు. వాళ్లను జనావాసాలకు దూరంగా తీసుకెళ్లాడు. అక్కడే ఇద్దరిపై ఘోరానికి పాల్పడ్డాడు.
ఇంటికొచ్చిన పిల్లలు ఏడుస్తూ ఏం జరిగిందో చెప్పారు. దీంతో తల్లిదండ్రులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే గ్రామస్తుల సహాయంతో వెళ్లి సికిందర్ ను పట్టుకున్నారు. కసితీరా వాడ్ని కొట్టారు. ఆ తర్వాత అతడి బస్సును కాల్చి బూడిద చేశారు.
కసితీరా కొట్టిన తర్వాత పోలీసుల్ని పిలిచి డ్రైవర్ ను అప్పగించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ అమిత్ కుమార్ వెల్లడించారు. సికిందర్ మూడేళ్లుగా ఆ పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.