రిజల్ట్ 1: కమలబలం నీటి బుడగ!

తెలంగాణ ఎన్నికల్లో ఇవాళ పోలింగ్ మాత్రమే జరగబోతోంది. ఫలితం తెలియాలంటే ఇంకా మూడు రోజులు ఆగాలి. కౌంటింగ్ పూర్తి కావాలి.. అప్పుడే.. తెలంగాణను ఏలే తదుపరి నేత ఎవరో తేలుతుంది. కానీ, రిజల్ట్- ఫలితం…

తెలంగాణ ఎన్నికల్లో ఇవాళ పోలింగ్ మాత్రమే జరగబోతోంది. ఫలితం తెలియాలంటే ఇంకా మూడు రోజులు ఆగాలి. కౌంటింగ్ పూర్తి కావాలి.. అప్పుడే.. తెలంగాణను ఏలే తదుపరి నేత ఎవరో తేలుతుంది. కానీ, రిజల్ట్- ఫలితం అంటే కేవలం కొత్త సీఎం ఎవరు అనేది మాత్రమే కాదు! 

రిజల్ట్ రూపంలో తేలే సంగతులు.. ఈ ఎన్నికల కారణంగా నిగ్గుతేలే విషయాలు అనేకం ఉంటాయి. వాటన్నింటినీ కూడా ‘రిజల్ట్’ గానే పరిగణించాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం నీటిబుడగ అని చాలా స్పష్టంగా తేలిపోయింది.

ఏదైనా రాజకీయ పార్టీకి ప్రజాబలం పరిమితంగా, తక్కువగా ఉండడం అనేది పాపమేమీ కాదు. అన్ని పార్టీలకు సమానమైన బలం ఉండడం అనేది అసాధ్యం, అసహజం కూడా! కానీ.. లేని బలం గురించి గప్పాలు కొట్టుకుంటూ.. ప్రజలను బురిడీ కొట్టించాలని చూడడం మాత్రం తప్పు. 

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అదే పనిచేసింది. ఆ పార్టీకి ఇక్కడ బలం లేదు. ఇక్కడి ప్రజల్లో విశ్వసనీయత లేదు. దానిని పెంచుకునే ప్రయత్నం వారు చేయలేదు. ప్రజల తరఫున నిర్దిష్టమైన ప్రజా పోరాటాలు చేయలేదు. ఒకటిరెండు ఉప ఎన్నికల విజయాలు దక్కగానే.. రాష్ట్రం మొత్తం కమలం హవా నడుస్తున్నట్టుగా ఎగిరెగిరి పడ్డారు. 

ప్రగల్భాలు రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ చాలా సహజంగా పలుకుతుంటారు గానీ.. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల బలం కలిగి ఉండి, ఒక్కసారిగా తాము ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయబోతున్నామని ప్రగల్భాలు పలకడం మాత్రం వారికే చెల్లింది.

లేనిబలాన్ని గురించి చాటుకుంటూ.. చాలా కాలం పాటు చాలా హడావుడి చేసిన బిజెపి ఎన్నికల సమయం వచ్చేసరికి కమలం మొత్తం నీరుగారిపోయింది. అంతర్గతంగా పార్టీ కీలక నాయకుల లెక్కల్లోనే 7-8 సీట్లు దక్కవచ్చునని అనుకుంటున్నారంటే ఎంత దయనీయస్థితిలో ఆ పార్టీ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. వారి అంచనాలతోనే.. ఆ పార్టీ కేవలం నీటిబుడగ మాత్రమే అని తేలిపోతోంది. 

మోడీ, అమిత్ షాలు కూడా ముమ్మరంగా తిరిగి ప్రచారాలు నిర్వహించారు. అయినా సరే.. భారతీయ జనతా పార్టీ రెండంకెల స్కోరును నమోదు చేయలేకపోతే గనుక.. ఆ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మరని, వారి బూటకపు మాటలను విశ్వసించరని అనుకోవాల్సిందే.