తాను బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నానో లేదో చెప్పాల్సింది పార్టీ నాయకత్వమే అని కామెంట్స్ చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ పార్టీ గుర్తించి పార్టీ నుండి సస్పెండ్ చేసింది. జూపల్లితో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా వేటు వేసింది.
గత కొంత కాలంగా ఈ ఇరువురు నేతలు పార్టీపై విమర్శలు చేస్తున్నా పార్టీ చూసి చూడనట్లు వస్తున్నా తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గోన్న జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్ పై చేసిన తీవ్ర విమర్శల ఫలితమే సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి మాట్లాడుతూ… ఎందరో అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని.. తెలంగాణలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని.. బీఆర్ఎస్ పేరుతో చెత్త పాలనను దేశానికి ఇవ్వాలనుకుంటున్నారా అంటూ విమర్శించారు.
పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని.. కానీ అది సాధ్యం కాదని.. కుటుంబ స్వార్థానికి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నారని.. అది పగటి కలేనంటూ విమర్శించారు.