బాబుకు తెలంగాణ పోలీసుల షాక్‌!

టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడిపై ఏపీలో వ‌రుస కేసులు న‌మోదవుతున్న నేప‌థ్యంలో, తెలంగాణ‌లో కూడా ఆయ‌న‌పై కేసు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప‌రిస్థితుల్లో టీడీపీ ఓట్ల కోసం చంద్ర‌బాబుపై…

టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడిపై ఏపీలో వ‌రుస కేసులు న‌మోదవుతున్న నేప‌థ్యంలో, తెలంగాణ‌లో కూడా ఆయ‌న‌పై కేసు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప‌రిస్థితుల్లో టీడీపీ ఓట్ల కోసం చంద్ర‌బాబుపై అంతా ప్రేమ క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు అరెస్ట్‌, వృద్ధాప్యంలో ఆయ‌న్ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో పెట్ట‌డాన్ని బీజేపీ, బీఆర్ఎస్‌, కాంగ్రెస్ నాయ‌కులు త‌ప్పు ప‌ట్టారు.

ఓట్ల కోస‌మే ఈ విద్య‌ల‌న్నీ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధీనంలో పోలీస్ వ్య‌వ‌స్థ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో అనుమ‌తి లేకుండా చంద్ర‌బాబునాయుడు బేగంపేట విమానాశ్ర‌యం నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న ఇంటి వ‌ర‌కూ ర్యాలీగా వెళ్లి ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించ‌డంపై బేగంపేట పోలీసులు కేసు న‌మోదు చేశారు.

చంద్ర‌బాబుతో పాటు హైద‌రాబాద్ న‌గ‌ర టీడీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జీవీజీనాయుడు త‌దిత‌రుల‌పై కేసు న‌మోదైంది. ఎస్ఐ జ‌య‌చంద‌ర్ ఫిర్యాదుతో కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. ర్యాలీలో సుమారు 400 మంది పాల్గొన్న‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమ‌తి లేకుండా ర్యాలీ నిర్వ‌హించి న‌గ‌రంలో న్యూసెన్స్ క్రియేట్ చేశార‌ని తెలిపారు. అస‌లే చంద్ర‌బాబుపై ఏపీలో రోజుకొక కేసు న‌మోద‌వుతోంది.

స్కిల్ స్కామ్‌లో అరెస్ట‌యిన చంద్ర‌బాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో 52 రోజుల పాటు ఉన్నారు. అనారోగ్య కార‌ణాల రీత్యా వైద్యం కోసం ఆయ‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చారు. విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌కు ప్ర‌త్యేక విమానంలో వెళ్లిన చంద్ర‌బాబుకు బేగంపేట విమానాశ్ర‌యం వ‌ద్ద ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనుమ‌తి లేకుండా ఊరేగింపుగా వెళ్ల‌డంతో ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించిన‌ట్టుగా భావించి చంద్ర‌బాబు, ఆయ‌న అనుచ‌రుల‌పై కేసు న‌మోదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.