కామెడీ: ఎన్నిక చెల్లుబాటుపై ఇంకా కేసులు!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. షెడ్యూలు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే కోడ్ అమల్లోకి వస్తుందని కూడా వెల్లడించింది. అదే తడవుగా తనఖీల కత్తి ఝుళిపించిన పోలీసులు.. షెడ్యూలు ప్రకటించిన…

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. షెడ్యూలు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే కోడ్ అమల్లోకి వస్తుందని కూడా వెల్లడించింది. అదే తడవుగా తనఖీల కత్తి ఝుళిపించిన పోలీసులు.. షెడ్యూలు ప్రకటించిన రోజునే ముమ్మరంగా సోదాలు చేసి.. కోట్లలో నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే.. 2018 ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసిపోయినట్టే అనుకోవాలి. టెక్నికల్ గా వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉంటారు అంతే. మంత్రుల అధికారిక వాహనాల వినియోగంపై ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చేశాయి.

ఒకవైపు గతంలో ఎన్నికైన వారి వ్యవహారం ఇలా ముగిసిపోతుండగా.. అప్పుడు గెలిచిన వారి ఎన్నిక చెల్లుతుందా? చెల్లదా? అనే విషయంలో న్యాయస్థానాల్లో ఇంకా కేసులు నడుస్తూనే ఉండడం పెద్ద కామెడీగా ఉంది.

తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లోనే మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తులు అప్పులు తెలియజేసే అఫిడవిట్ ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించాక, మళ్లీ వెనక్కు తీసుకుని, సవరించి ఇచ్చారని.. అది చట్ట విరుద్ధమని, ఆయన ఎన్నిక చెల్లనట్లుగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు. దాని మీద ఇప్పటిదాకా విచారణ సాగుతూ వచ్చింది. 

తీరా సోమవారం నాడు ఎన్నికల షెడ్యూలు ప్రకటన వచ్చిన తర్వాత.. మంగళవారం నాడు హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే.. శ్రీనివాస గౌడ్ కు దక్కిన ఊరట మాత్రం ఏముంది? తన ఎన్నికల చెల్లదనే మాట తప్పించుకున్నారు తప్ప.. ప్రభుత్వ పదవీకాలమే తుది అంకానికి చేరుకున్న సమయంలో తీర్పు వచ్చింది.

తమాషా ఏంటంటే.. ఇలాంటి కేసులు ఇంకా రెండున్నాయి. కొత్తగూడెంలో కాంగ్రెసు తరఫున గెలిచిన వనమా నాగేశ్వరరావు ఎన్నిక చెల్లదని, తక్షణం అక్కడ జలగం వెంకట్రావు గెలిచినట్టుగా ప్రకటించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వనమా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దాని మీద విచారణ జరుగుతోంది. అదే సమయంలో అక్కడ రాబోయే ఎన్నికలకు అప్పట్లో ఓడిపోయిన భారాస అభ్యర్థి జలగం వెంకట్రావు పేరునే కేసీఆర్ ప్రకటించారు. దీంతో పెద్దగా వివాదం లేకుండా పోయింది.

కానీ గద్వాల పరిస్థితి అలా కాదు. అక్కడ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని, తక్షణం డికె అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆమె కేంద్ర ఎన్నికల సంఘం దాకా వెళ్లి.. అసెంబ్లీ అధికారుల్ని తదనుగుణంగా ఆదేశిస్తూ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈలోగా.. బండ్ల సుప్రీంకు వెళ్లడంతో కేసు మొదటికి వచ్చింది.

ఈలోగా ఎన్నికలే ముగిసిపోయేలా ఉన్నాయి. బహుశా మరో యాభై రోజుల్లో ఎన్నికల పర్వం ముగిసిపోయిన తర్వాత.. అప్పటిలోగా ఈ కేసులు తేలకపోతే.. వాటిని కోర్టులు కొట్టివేస్తాయేమో చూడాలి.