గెలుపు గ్యారంటీ సీట్లు మాత్రమే తొలి జాబితానా?

కాంగ్రెసు పార్టీకి ఏమైందో గానీ.. సుమారు నెలరోజులకు పైగా సుదీర్ఘమైన కసరత్తు చేసి.. చిట్టచివరికి సగం కంటె తక్కువస్థానాలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటిస్తున్నది. ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ యొక్క వ్యూహం అనుకోవాలా? బలహీనతా…

కాంగ్రెసు పార్టీకి ఏమైందో గానీ.. సుమారు నెలరోజులకు పైగా సుదీర్ఘమైన కసరత్తు చేసి.. చిట్టచివరికి సగం కంటె తక్కువస్థానాలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటిస్తున్నది. ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ యొక్క వ్యూహం అనుకోవాలా? బలహీనతా అనుకోవాలా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. 

ఒకేవిడతలో ఏకంగా 114 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించిన భారాసతో తలపడేందుకు, ఓడించేందుకు చాలా గట్టి ప్రయత్నాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఆదివారం నాడు 58 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో తొలిజాబితా తెస్తున్నది. మరో నాలుగు రోజుల్లో రెండో జాబితా కూడా వస్తుందని అంటున్నారు. వామపక్షాలతో పొత్తుల విషయంలో కూడా ఆదివారం తుదినిర్ణయం ఉంటుందని అంటున్నారు.

తమాషా ఏంటంటే.. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించేసిన సుమారు నెల తర్వాత.. తమ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్న, అభ్యర్థులందరికీ బీఫారాలు కూడా అందజేస్తున్న రోజున కాంగ్రెస్ తొలిజాబితాతోనే కుస్తీలు పడుతుండడం గమనార్హం. 58 స్థానాల తొలిజాబితా వస్తుందని, మరో 44 స్థానాల పేర్లు త్వరలో ఉంటుందని.. మిగిలినవి వామపక్షాలతో కలిసి నిర్ణయిస్తారని సమాచారం.

గెలుపు గ్యారంటీ అనుకున్న సీట్లను మాత్రమే తొలిజాబితాలో కాంగ్రెసు ప్రకటిస్తున్నదా? అనే చర్చ ఒకవైపు ఉంది. ఈ స్థానాల్లో కూడా అధికార పార్టీనుంచి గట్టిపోటీ ఉండే అవకాశం ఉన్నవి కూడా ఉన్నాయి. తొలి జాబితాలోని ఈ 58లో 33 శాతానికి పైగా రెడ్డి సామాజికవర్గం నాయకులే ఉన్నారు. తొలిజాబితాలో కొన్ని ట్విస్టులు కూడా ఉంటున్నాయి. 

ఒక కుటుంబంలో రెండేసి టికెట్లు ఇవ్వడం తమ పార్టీ సాంప్రదాయం కాదని చెబుతూ ఉండే కాంగ్రెసు, హుజూర్ నగర్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోదాడను ఆయన భార్య పద్మావతిరెడ్డికి కేటాయించింది. అలాగే తమ తండ్రీకొడుకులు ఇద్దరికీ టికెట్లు కావాల్సిందే అనే కండిషన్ తో కాంగ్రెసులో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కొడుకు రోహిత్ రావులకు  మల్కాజిగిరి, మెదక్ లను కేటాయించారు. 

అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకుని దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణు కు రిక్తహస్తం ఎదురైనట్టే. తొలి జాబితాలో ఈ నియోజకవర్గాన్ని క్రికెటర్ అజారుద్దీన్ కు కేటాయిస్తున్నట్టుగా వినిపిస్తోంది. ఇటీవలే హైదరాబాదు క్రికెట్ క్లబ్ ఎన్నికల్లో పోటీచేసే అర్హత మాత్రమే కాదు కదా, చివరికి తన ఓటుహక్కును కూడా కోల్పోయిన అజారుద్దీన్ ఈ ఎన్నికల్లో మాత్రం టికెట్ దక్కించుకున్నారు.