వారెవ్వా.. తండ్రీత‌న‌యుడికి కాంగ్రెస్ టికెట్లు!

మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు పంతం ప‌ట్టి కాంగ్రెస్‌లో సాధించుకున్నారు. బీఆర్ఎస్ జాబితాలో మ‌ల్కాజ్‌గిరి నుంచి మైనంప‌ల్లికి చోటు క‌ల్పించారు. అయితే త‌న కుమారుడైన డాక్ట‌ర్ రోహిత్‌రావు సేవా దృక్ప‌థం క‌లిగిన యువ నాయ‌కుడ‌ని,…

మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు పంతం ప‌ట్టి కాంగ్రెస్‌లో సాధించుకున్నారు. బీఆర్ఎస్ జాబితాలో మ‌ల్కాజ్‌గిరి నుంచి మైనంప‌ల్లికి చోటు క‌ల్పించారు. అయితే త‌న కుమారుడైన డాక్ట‌ర్ రోహిత్‌రావు సేవా దృక్ప‌థం క‌లిగిన యువ నాయ‌కుడ‌ని, రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఆశ‌యంతో ఉన్నార‌ని, మెద‌క్ నుంచి టికెట్ ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్‌ను కోరారు. కానీ మైనంప‌ల్లి విజ్ఞ‌ప్తిని సీఎం కేసీఆర్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు.

వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన మైనంప‌ల్లి ఆర్థికంగా స్థితిమంతుడు. కేవ‌లం త‌న‌కు టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్‌లో కొన‌సాగే ప‌రిస్థితి లేద‌ని తేల్చి చెప్పారు. మెద‌క్ టికెట్‌ను త‌న కుమారుడికి ఇవ్వాల్సిందే అని, క‌రోనా స‌మ‌యంలో విస్తృతంగా సేవ‌లు అందించాడ‌ని, మంచి పేరు వుంద‌ని డాక్ట‌ర్ రోహిత్ గురించి గొప్ప‌గా చెప్పారు. అయినా బీఆర్ఎస్ చెవికెక్కించుకోలేదు.

దీంతో ఆయ‌న కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారు. త‌న‌కు మ‌ల్కాజ్‌గిరి, కుమారుడికి మెద‌క్ టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టు ప‌ట్టారు. ఆ ష‌ర‌తుకు అంగీక‌రిస్తేనే కాంగ్రెస్‌లో చేరుతాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయ‌న డిమాండ్‌కు త‌లొగ్గింది. కాంగ్రెస్ ఇవాళ విడుద‌ల చేసిన మొద‌టి జాబితాలో మ‌ల్కాజ్‌గిరి నుంచి హ‌నుమంత‌రావు, మెద‌క్ సీటును ఆయ‌న కుమారుడు డాక్ట‌ర్ రోహిత్ ద‌క్కించుకోవ‌డం విశేషం. 

తండ్రీత‌న‌యులు కాంగ్రెస్ టికెట్లు ద‌క్కించుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఇక ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను చూర‌గొన‌డ‌మే త‌రువాయి. ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తారా? లేదా? అనేది రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జాతీర్పుపై ఆధార‌ప‌డి వుంటుంది.